ఆక్రమణదారులకు నోటీసుల గుబులు | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణదారులకు నోటీసుల గుబులు

Mar 29 2026 7:11 AM | Updated on Mar 29 2026 7:11 AM

మున్సిపాలిటీల్లో చెరువుల ఆక్రమణపై సంయుక్త ఆపరేషన్‌

సాక్షి, పార్వతీపురం మన్యం : మున్సిపాలిటీల్లో చెరువు, బంద స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. పలువురికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇందుకోసం మున్సిపాలిటీ, పోలీస్‌, రెవెన్యూ శాఖలు సంయుక్త ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి. దీంతో నిర్మాణదారుల్లో గుబులు మొదలైంది.

సర్వే పూర్తి..

పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు, పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ప్రధాన చెరువులకు సంబంధించి ఇప్పటికే సర్వే ప్రక్రియ పూర్తి చేశారు. ఈ సర్వేలో గుర్తించిన ఆక్రమణదారులకు మొదటి విడత నోటీసులు జారీ చేశారు. నిబంధనల మేరకు ఆక్రమణదారులకు రెండో నోటీసు జారీ చేయాలని నిర్ణయించారు. నోటీసుల జారీ, సర్వే చేస్తున్నప్పుడు ఫొటో తీసుకుంటున్నారు. చట్టపరమైన ఇబ్బందులు కలగకుండా రిజిస్టర్‌ పోస్టులోనూ పంపించనున్నారు. క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారి మార్గదర్శకత్వంలో కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులకు తగు సూచనలు చేశారు.

ఉపేక్షించేది లేదు.. : కలెక్టర్‌

చెరువులను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లోని జలవనరుల రక్షణ.. ఆక్రమణల గుర్తింపుపై శనివారం పాలకొండ సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌తో కలసి సాలూరు, పాలకొండ, పార్వతీపురం కమిషనర్లు, పట్టణ ప్రణాళిక విభాగ అధికారులతో ఆన్‌లైన్‌లో ఆయన సమీక్షించారు. మున్సిపాలిటీల పరిధిలోని చెరువుల పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు. సర్వే పూర్తి చేసి, ఆక్రమణల గుర్తింపు ఇప్పటికే పూర్తయిందని అధికారులు వివరించారు.

నిర్మాణదారుల్లో గుబులు

పార్వతీపురం పట్టణంలో ప్రభుత్వ చెరువు స్థలాలు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురయ్యాయి. వీటిపై దర్జాగా నిర్మాణాలు సాగించారు. ఇప్పుడు వారందరిలోనూ గుబులు మొదలైంది. బైపాస్‌ కాలనీ, నెల్లి చెరువు, ఇతర ప్రాంతాల్లోనూ నిర్మాణదారులకు నోటీసులు అందజేశారు. మరోవైపు రిటర్నింగ్‌ వాల్‌ పరిధిలోని ఇళ్లకు సైతం నోటీసులు జారీ చేయడంతో నివాసితులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ పలువురి ప్రముఖుల ఇళ్ల నిర్మాణాలూ ఉన్నాయి. తరతరాలుగా నివాసం ఉంటున్న వారిపై నోటీసుల అస్త్రం ప్రయోగించడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో రిటర్నింగ్‌ వాల్‌ కట్టి సురక్షితం చేసిన నివాసాలకూ నోటీసులు అందిస్తుండటంతో ప్రభుత్వ తీరుపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement