పార్వతీపురం రూరల్ : పర్యావరణ హితమే లక్ష్యంగా పార్వతీపురం నగర సుందరీకరణ పనులకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం గెడ్డ వీధి కాలువ వంతెన సమీపంలోని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ప్రారంభించారు.
ప్రస్తుతం కాలువ వంతెన అంచున (ఎడ్జ్ భాగంలో) కొబ్బరి మొక్కలను నాటారు. సోమవారం నుంచి వంతెన రెండో వైపు కూడా మొక్కలు నాటే పనులు కొనసాగనున్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారుల మధ్య గల డివైడర్లలో ఆకర్షణీయమైన ‘బోగన్ విల్లియా’ మొక్కలను ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో సబ్–కలెక్టర్ వైశాలి, పార్వతీపురం, పాలకొండ, సాలూరు మున్సిపల్ కమిషనర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


