శనివారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2026
కమనీయం..
గరుగుబిల్లి: మంగళవాయిద్యాలు.. భక్తుల జయజయధ్వానాలు.. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ తోటపల్లి కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం సీతారాముల కల్యాణం కమనీయంగా సాగింది. ఆలయ ప్రాంగణం జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగింది. వేంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి వారి దేవస్థానాల్లో ఉదయం సుప్రభాతసేవ, ఆరాధన, మంగళాశాసనం, విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరుణం, మత్సగ్రహణం, అంకురారోపణం, తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉభయ ఆలయాల్లో స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఆలయ అర్చకులు వి.వి.అప్పలాచార్యులు, ఎం.రామకష్ణ శర్మలు అభిజిత్‌లగ్నంలో సీతారామస్వామి కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. కల్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు మురిసిపోయారు. స్వామివార్లకు పూజా సామగ్రి, పట్టువస్త్రాలను దాతలు సమకుర్చారు. భక్తులకు పానకం, వడపప్పు, పులిహోర ప్రసాదాలను పంచిపెట్టారు. అన్నప్రసాదాన్ని వడ్డించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈఓ బి.శ్రీనివాస్, ఆలయ చైర్మన్ ఎం.పకీరునాయుడు, కమిటీ సభ్యులు సేవలందించారు. సాయంత్రం స్వామివారి పట్టాభిషేకం జరిపించారు.


