అమ్మో.. అతి! | - | Sakshi
Sakshi News home page

అమ్మో.. అతి!

Mar 28 2026 7:27 AM | Updated on Mar 28 2026 7:27 AM

ఇద్దరు గన్‌మెన్‌లు కావాలంట?

ఇదేం పద్ధతి

వాపోతున్న ‘తమ్ముళ్లు’

అధికార దర్పంతో టీడీపీ మహిళా నేత దూకుడు

అధికారులకూ ‘ఆదేశాలు’

సాక్షి, పార్వతీపురం మన్యం: పేరుకు జిల్లా తెలుగుదేశంలో ఓ పదవి.. దానికి తోడు ఉందో, లేదో తెలియనంతగా ఒక చిన్న పోస్టు! ఇది జనంలోనే కాదు.. సొంత పార్టీలోనూ నడుస్తున్న టాక్‌!! మరి ఆ మాత్రానికే తాను ఓ ‘పెద్ద’లా భావించేసుకుని.. ‘వతి’ని కాస్తా అతిగా మార్చేసి హడావిడి చేస్తున్న టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు తీరు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

పేరుకు పార్టీలో ఓ పదవి ఉన్నప్పటికీ.. ఆమె వ్యవహార తీరు మాత్రం ‘మంత్రి’ స్థాయికి తగ్గడం లేదని సొంత పార్టీకి చెందిన వారే గుసగుసలాడుతున్నారు. ఇప్పటికే ‘సైరన్‌’ నాయకురాలిగా పేరున్న ఆమె దూకుడును చూసి ఎమ్మెల్యేలు సైతం తలలు పట్టుకుంటున్నారు. దాదాపు పార్లమెంటు పరిధిలోని నియోజక వర్గాలను చుట్టుముట్టేస్తున్న ఆమె.. అన్ని చోట్లా సొంతంగా తనకంటూ ఒక కోటరీ ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారు. గతంలో ఓ రెండు నియోజక వర్గాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించి, భంగపాటుకు గురైన అనుభవం.. రానున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తుకుండా ఉండాలన్న ఉద్దేశంతో ముందుగానే తనకంటూ ప్రత్యేకంగా ఓ వర్గాన్ని సృష్టించుకుంటున్నారని నియోజకవర్గాల నుంచి వినిపిస్తోంది. ఇప్పుటికే ఒక నియోజక వర్గంలో పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆమె తీరు పట్ల పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు రగిలిపోతున్నట్టు సమాచారం.

అధికారులకు హుకుం..

ఆమెకంటూ రాజ్యాంగబద్ధంగా ఏ పదవీ లేకపోయినప్పటికీ.. పార్టీ ఇచ్చిన హోదాతోనే అధికార దర్పం చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల వద్దకు వెళ్లడం, సమస్యలు పరిష్కరించాలని ఆదేశించడం.. ఆస్పత్రులను పరిశీలించడం, అక్కడ అందిస్తున్న వైద్యంపై వైద్యులతో సమీక్ష నిర్వహించి తగు సూచనలు చేయడం సదరు మహిళా నేతకు అలవాటుగా మారిపోయింది. ఏ అధికారం ఉందని ఇలా ఆదేశాలు జారీ చేస్తారని అధికారులు, వైద్యులు తలలు పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అక్కడితో ఆగిపోకుండా, తన సిఫారసుతో ఉద్యోగాలు కూడా ఇవ్వాలని సూచిస్తున్నట్లు సమాచారం. ఇలా ఉద్యోగాల పేరిట ఆమె అనుచరులు వసూళ్లకు సైతం పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూటమి వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. తనకంటూ ప్రొటోకాల్‌ పాటించాలని అధికారులకు సైతం ఆదేశాలు జారీ చేస్తున్నారని ఉద్యోగ వర్గాల నుంచి వినిపిస్తోంది.

సాధారణంగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం భద్రత కల్పిస్తూ.. ఒక గన్‌ మెన్‌ను ఏర్పాటు చేస్తుంది. క్యాబినెట్‌ హోదా ఉన్నవారికి ఇద్దరు గన్‌మెన్‌లను కల్పిస్తుంది. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భద్రత దృష్ట్యా ఎమ్మెల్యేలు సైతం ఇద్దరిని కోరవచ్చు. ఇటు ఎమ్మెల్యే కాకపోయినా.. అటు మంత్రి కాకున్నా.. తనకూ గన్‌మెన్‌ కావాలని ఆ మహిళా నేత అర్జీ పెట్టుకున్నట్లు సమాచారం. అలా అని ఒక్కరు కాకుండా.. తన పర్యటనల దృష్ట్యా ఇద్దరు గన్‌మెన్‌లు ఉండాలని కోరినట్లు తెలుస్తోంది. దీనిని పోలీసు అధికారులు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. రాజ్యాంగబద్ధ పదవి లేకపోయినప్పటికీ, అధికారం చెలాయిస్తున్న ఆమెకు... భవిష్యత్తులో ఏదైనా పదవి వస్తే ఇంకెలా ఉంటుందోనని కూటమి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement