ఉత్తర్వులు, పత్రాలు ఉండవు..
● ‘వెలుగు’లో ఇష్టానుసారం చెల్లింపులు
● సరైన బిల్లులు, ఓచర్లు లేకుండానే నిధులు డ్రా
సాక్షి, పార్వతీపురం మన్యం: దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. తిన్నోళ్లకు తిన్నంత! ఒక లెక్కాపత్రం ఉండదు.. అడిగే వారు అసలే ఉండరు!! పేరుకే ‘వెలుగు’.. తవ్వేకొద్దీ అక్రమాల చీకట్లే. గత ఏపీడీ, ఇన్‌చార్జి పీడీగా పని చేసిన సత్యంనాయుడు హయాంలో శాఖలో జరిగిన అవినీతికి ‘లెక్కే’ లేదు. యంత్రాల కొనుగోలు, ఉపాధి శిక్షణలు, బిల్లుల చెల్లింపులు.. ఇలా ఒక్కటేమిటి? సర్వం ‘స్వాహా’గానే కొన్నేళ్లుగా డీఆర్‌డీఏ పనితీరు ఉంది. వెలుగులో జరిగిన అవినీతిపై ఫిర్యాదులు వెళ్లగా.. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ చేపట్టారు. ఇందులో అనేక చీకటి కోణాలు ‘వెలుగులోకి వస్తున్నాయి. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన లక్ష్యంగా చేపట్టిన ఉన్నతి కార్యక్రమం అమల్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కార్యక్రమం కింద రూ.105.5 కోట్ల రుణాలను పంపిణీ చేసినప్పటికీ.. వసూళ్లలో పురోగతి కనిపించలేదు. కేవలం రూ.14.474 కోట్లు మాత్రమే వసూలైనట్లు గుర్తించారు. సర్వీసు సెంటర్ల కోసం ఉద్దేశించిన ల్యాప్‌టాప్‌లను.. అధికారుల కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు. సరఫరా చేసిన 40 లాప్‌ట్యాప్‌ల్లో తొమ్మిదే పని చేస్తున్నట్లు గుర్తించారు. 27 పని చేయడం లేదు. 2024–25 కాలానికి కుట్టు యంత్రాలు, టెంట్లు, పిండి మిల్లుల కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగనట్లు ఆరోపణలు వచ్చాయి. పారదర్శకతను పక్కన పెట్టి, కొనుగోలు జరిపినట్లు విచారణలో తేలిందని సమాచారం.
శిక్షణలు అలా కలిసొచ్చాయి..
2023లో ఓ శిక్షణ నిమిత్తం రూ.2,75,000 నగదు రూపంలో తీసుకున్నారు. సంబంధిత చెల్లింపులన్నీ నగదు రూపంలోనే జరిగాయి. ఇందులో అల్పాహారం, భోజనం కోసం 2023 ఏప్రిల్‌లో ఐటీడీఏ క్యాంటీన్‌కు రూ.67.800 నగదు రూపంలో చెల్లించారు. దీనికి సంబంధించిన చెక్కు శాంతికుమారి పేరిట జారీ చేశారు. బిల్లుల తేదీలు.. చెక్కు జారీ చేసిన తేదీ కంటే ముందుగా ఉండటం గమనార్హం.
– ఆర్థిక సమ్మిళిత శిక్షణ నిమిత్తం సరైన వివరాలు ఇవ్వకుండానే ఆహార ఖర్చుల కింద రూ.11,200 మొత్తాన్ని క్లెయిమ్ చేశారు. ఉన్నతి శిక్షణ కోసం ఓ ఏపీఎం ఇంకొంత మొత్తం బిల్లు సమర్పించారు. అదే ఏడాది అరుణోదయ ప్రింట్ హౌస్ పేరిట రూ.13,45,886 మొత్తానికి చెక్కు చెల్లించారు. దీనికి సంబంధించి అనుబంధ బిల్లులు, ఆమోదాలు, పంపిణీ రసీదులు అందుబాటులో లేవు. కొనుగోలు విధానాలు కూడా పాటించలేదని గుర్తించారు.
అదే పోస్టుకు రావాలనీ..
కొద్దిరోజుల కిందటి వరకూ డీఆర్‌డీఏ పీడీగా సుధారాణి పనిచేసేవారు. ఆమె బదిలీపై విజయనగరం జిల్లాకు వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఇన్‌చార్జి పీడీగా సబ్ కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ పోస్టులోకి వచ్చేందుకు కొందరు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇందులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సైతం ఉన్నారని తెలుస్తోంది.
మండల సమాఖ్యలకు సరైన పత్రాలు లేకుండానే రూ.లక్షలు మళ్లించారు. బ్యాంకరు లేఖ గానీ, ఎస్‌ఈఆర్‌పీ సర్క్యులర్ గానీ లేకుండా సీతానగరం, గరుగుబిల్లి, పాలకొండలకు రూ.26 లక్షలు బదిలీ చేశారు. 13 మండలాలకు ఒక్కొక్కదానికి రూ.24 వేలు చొప్పున బదిలీ చేశారు.
2024 ఏప్రిల్ 1 నుంచి అదే ఏడాది జూన్ 11వ తేదీ వరకు జరిగిన లావాదేవీలకు బిల్లులు, ఓచర్లు అందుబాటులో లేవు. జూన్‌లో నిర్వహించిన రెండు సమావేశాల కోసం బిల్లులు, ఓచర్లు, సంతకాలు లేకుండా రూ.2,31,000 నగదు విత్‌డ్రా చేశారు. రికార్డులో ఎటువంటి టీఏ, డీఏ క్లెయిమ్ ఫారాలు లేకుండానే జిల్లా సమాఖ్య ఓబీ సభ్యులకు టీఏ, డీఏ మొత్తం బదిలీ చేశారు. ఎటువంటి ఉత్తర్వులు, ఆదేశాలు రికార్డుల్లో లేకుండా పలువురికి జీతాల బిల్లులు రూ.లక్షల్లో చెల్లించారు.
2025లో ఫిబ్రవరిలో ఓ శిక్షణ నిమిత్తం 15 మండలాలకు రూ.17,50,000 చెల్లించారు. ప్రాజెక్టు డైరెక్టర్ స్థాయిలో గానీ, జిల్లా గిరిజన మహిళా సమాఖ్య స్థాయిలో గానీ ఎటువంటి నోట్‌ఫైళ్లు, కార్యనిర్వహణ ఉత్తర్వులు, ఓచర్లు అందుబాటులో లేకపోవడం విశేషం. మండల సమాఖ్యలకు నిధులు బదిలీ చేసేటప్పుడు బ్యాంకర్ల లేఖలు, సెర్ప్ సర్క్యులర్లు సమర్పించకపోవడాన్ని విచారణలో గుర్తించారు. ఈ విధంగా రూ.కోట్లలో మొత్తం చెల్లించారు. 2025 మార్చి 19న ఇలా సుమారు రూ.45 లక్షలు బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
2023–24 ఆర్థిక సంవత్సరానికి శాఖలో కార్యకలాపాలకు సంబంధించిన ఆడిట్ నిర్వహించారు. ఆర్థిక అవకతకవలేవీ ఆడిట్ సమయంలో గుర్తించకపోవడం గమనార్హం. ఆడిట్ కేవలం నామమాత్రంగానే సాగిందనడానికి ఈ ఉదంతాలే ఉదాహరణలు.
చింతపల్లి మండలం ఎఫ్‌పీఓ నుంచి పార్వతీపురం వరకు పసుపు రవాణా నిమిత్తం అడ్వాన్సుగా రూ.20 వేలు మంజూరు చేశారు. మరో ట్రేడర్స్‌కు 30 వేలు మంజూరు చేశారు. సరైన మార్గదర్శకాలు లేకుండానే అడ్వాన్సులు ఇవ్వడం.. వాటి సర్దుబాటులో జాప్యం, రికార్డుల మధ్య వ్యత్యాసం కనిపించింది. అంచనా పత్రాలు లేకుండా స్వాతంత్య్ర దినోత్సవ అలంకరణ, శకట ఖర్చు, జిల్లా సమాఖ్య నిర్వహణ కోసం, బోరుబావుల మరమ్మతుల నిమిత్తం అడ్వాన్సు పేరిట రూ.లక్షలు మళ్లించారు. 2024లో ఒకఏపీఎంకు చేయూత కార్యక్రమ అడ్వాన్సు నిమిత్తం సహాయక బిల్లులు లేకుండానే రూ.2,30,000 చెల్లించినట్లు గుర్తించారు. జిల్లా గిరిజన మహిళా సమాఖ్య నుంచి సిబ్బందికి ముందస్తు చెల్లింపులు చేశారు. వాస్తవానికి చెక్కుల ద్వారా చెల్లించాల్సిన పెద్ద మొత్తాలను కూడా అడ్వాన్సులుగా తీసుకుని, నిబంధనలకు విరుద్ధంగా నగదు రూపంలో పంపిణీ చేశారు. ఇవన్నీ మచ్చుకు కొన్ని మాత్రమే.


