మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారి ఆలయ హుండీల ఆదాయాన్ని ఈఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం లెక్కించారు. ఈ ఏడాది 7, 8, 9వ జాతరకు వచ్చిన భక్తులు చదురుగుడి, వనంగుడిలోని హుండీలలో వేసిన కానుకల రూపంలో రూ.9,90,256 ఆదాయం వచ్చింది. బంగారం 4 గ్రాములు, వెండి 13 గ్రాములు సమకూరినట్లు ఈఓ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా దేవదాయశాఖ అధికారి ఎస్.రాజారావు, ఆలయ చైర్మన్ నైదాన చినతిరుపతి, సర్పంచ్ వి.సింహాచలమమ్మ, ఉప సర్పంచ్ అల్లు వెంకటరమణ, కమిటీ సభ్యులు, మాజీ చైర్మన్లు, శ్రీవారి సేవకులు, గ్రామపెద్దలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
వైద్యసేవల బలోపేతానికి ప్రాధాన్యం
● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి
పార్వతీపురం రూరల్: జిల్లాలోని గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో మాతా శిశు ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్‌ఎస్‌ఎల్) కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సమకూర్చిన ఆధునిక వైద్య పరికరాలను గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయ ప్రాంగణంలో ఆయన ప్రారంభించారు. మాతా శిశుమరణాల నివారణలో భాగంగా సుమారు 15 రేడియంట్ వార్మర్లు, 15 హైడ్రాలిక్ లేబర్ రూమ్ టేబుల్స్ (బెడ్లతో సహా) జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు (పీహెచ్‌సీ) పంపిణీ చేయాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. ప్రసవ సమయంలో గర్భిణులు, నవజాత శిశువులకు అత్యవసర ప్రాణ రక్షణ కల్పించడంలో ఈ ఆధునిక సాంకేతిక పరికరాలు కీలకమని పేర్కొన్నారు. పీహెచ్‌సీ సిబ్బందికి వీటి వినియోగంపై అవగాహన కల్పించి, గిరిజన ప్రజలకు సేవలు అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, డీఎంహెచ్‌ఓ ఎస్.భాస్కరరావు, హెచ్‌ఎస్‌ఎల్ ప్రతినిధులు డి.శ్రీనివాసరావు, ఐ.బేగ్, వి.ప్రశాంత్, వైద్యాధికారులు విజయపార్వతి, విజయమోహన్, జగన్ మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.
408 మందికి ఉచిత ప్రవేశాలు
పార్వతీపురం రూరల్: విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) 12(1)సి ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి తొలివిడత లాటరీ ఫలితాలు విడుదలయ్యాయి. 2026–27 విద్యా సంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా 796 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, కిలోమీటరు పరిధిలో ఉన్న 408 మందిని మొదటి విడతలో ఎంపిక చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి, అదనపు పథక సంచాలకులు తెలిపారు. ఎంపికై న విద్యార్థుల వివరాలను వారి తల్లిదండ్రుల మొబైల్ నంబర్లకు ఎస్‌ఎంఎస్ రూపంలో పంపించామని, హెచ్‌టీటీపీఎస్://సీఎస్సీ.ఏపీ.జీఓవీ.ఇన్/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. సీట్లు కేటాయించిన విద్యార్థులు ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 7వ తేదీలోపు సంబంధిత పాఠశాలల్లో చేరాల్సి ఉందన్నారు. విద్యార్థి, తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు, ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డు, పుట్టిన తేదీ పత్రం, స్టడీ సర్టిఫికెట్లను పాఠశాలల్లో సమర్పించి ప్రవేశాలను నిర్ధారించుకోవాలన్నారు. సందేహాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 18004258599ను సంప్రదించాలని కోరారు. ఐదు కిలోమీటర్ల పరిధిలోని విద్యార్థుల కోసం రెండో విడత లాటరీ ఫలితాలను ఏప్రిల్ 12న విడుదల చేస్తామన్నారు. అర్హత ఉన్న విద్యార్థులకు ప్రవేశాల కల్పనలో ప్రైవే టు పాఠశాల యాజమాన్యాలు నిరాకరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు. అడ్మిషన్ల ప్రక్రియను జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు (ఏపీసీలు) పర్యవేక్షిస్తారని, ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత మండల విద్యాశాఖాధికారులను (ఎంఈఓ) సంప్రదించాలని సూచించారు.


