వీరికి సఖ్యత లేక.. వారికి తీరిక కుదరక! | - | Sakshi
Sakshi News home page

వీరికి సఖ్యత లేక.. వారికి తీరిక కుదరక!

Mar 27 2026 9:24 AM | Updated on Mar 27 2026 9:24 AM

వీరికి సఖ్యత లేక.. వారికి తీరిక కుదరక!

సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ సోళ్ల బొజ్జి రెడ్డి గురువారం పార్వతీపురంలో పర్యటించారు. ఐటీడీఏ గిరిమిత్ర హాల్‌లో గ్రీవెన్స్‌సెల్‌ నిర్వహించారు. జిల్లాలో గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులు స్వీకరిస్తారని అంతా భావించారు. సమస్యలను చెప్పుకొనేందుకు పలువురు తరలివచ్చారు. ఒక ప్రణాళిక లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించిన ఐటీడీఏ.. విమర్శలపాలైంది. గిరిజన సంఘాల మధ్య ఉన్న సమన్వయలోపం గందరగోళానికి గురి చేసింది. సమస్యలను ప్రస్తావించాల్సిందిపోయి.. ఎవరికి వారు తామే కమిషన్‌ దృష్టిలో పడాలన్న తపన పలువురిలో కనిపించింది. కొంతమంది సమస్యను చెబుదామని లేవడం.. ఇంకొన్ని సంఘాల ప్రతినిధులు అడ్డు తగలడం.. వినతులిచ్చేందుకు పోటీ పడడంతో మొత్తంగా కార్యక్రమం గందరగోళమైంది. చేసేదిలేక, అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. చివరికి ‘వినతులిచ్చేయండి.. ఇబ్బందులేవైనా ఉంటే కలెక్టరేట్‌లో జరిగే సమీక్షలో మాట్లాడుకుందాం’ అంటూ చైర్మన్‌ ముగించేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

అంతా బాగుందంట..

కలెక్టరేట్‌లో అధికారులతో ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ నిర్వహించిన సమీక్షలోనూ అంతా ‘ప్రశంసాపూర్వకంగా’నే సాగడం విశేషం. గిరిజనులకు గానీ, గిరిజన విద్యార్థులకు గానీ సమస్యలేవీ లేవని అధికారులు చెప్పుకొన్నారు. ప్రధానంగా గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై లోతైన చర్చ జరగలేదు. పలువురు ఆదివాసీ సంఘం నేతలు మాట్లాడుతూ.. గిరిజనులకు రాజ్యాంగపరమైన హక్కులు దక్కేలా చూడాలని, బోగస్‌ సర్టిఫికెట్లపై విచారణ జరపాలని కోరారు. ఆదివాసీ గ్రామాల్లో రహదారుల నిర్మాణాలకు సంబంధించి అటవీ శాఖ అభ్యంతరం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కాలంలో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని చెల్లించే దిశగా చర్యలు తీసుకోవాలని కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చారు.

వినతుల స్వీకరణలో గందరగోళం

ఎస్టీ కమిషన్‌ ఎదుటే గిరిజన సంఘాల మధ్య సమన్వయలోపం

ప్రణాళిక లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించిన ఐటీడీఏ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement