సాలూరు: సాలూరు పట్టణంలో వందపడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి, ప్రస్తుత శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆ శిలాఫలకాన్ని కనుమరుగు చేయడం సరికాదని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజ్ననదొర అన్నారు. సాలూరులోని తన నివాసంలో విలేకరులతో గురువారం మాట్లాడారు. గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో కోవిడ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో కూడా బొత్స వచ్చి ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. ప్రారంభోత్సవ శిలాఫలకంలో ఆయన పేరును వేయకపోవడం విచారకరమన్నారు. శిలాఫలకంలో పేర్లు ఉన్నవారు ప్రొటోకాల్ పరిధిలోకి వస్తారా అని అధికారులను ప్రశ్నించారు. శిలాఫలకం కనుమరుగు చేసినంత మాత్రాన గత ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పాలనను దాచలేరన్నారు.
● ఏదైనా పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ పనులు, భవనాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టినా సుమారు నాలుగు నుంచి వారం రోజులు ముందుగా ఎంపీకి తెలియజేయాల్సిన బాధ్యత సంబంధిత ప్రొటోకాల్ అధికారి, ఇతర అధికారులపై ఉంటుందని రాజన్నదొర స్పష్టంచేశారు. అలాకాకుండా వందపడకల ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ముందురోజు ఫోన్‌చేసి అప్పటికప్పుడు రావాలని ఎంపీను ఆహ్వానించడం అవమానించడమే అవుతుందన్నారు. దీనికి సంబంధిత అధికారులు మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. గిరిజనులు, గిరిజన నాయకులు, గిరిజన ఎంపీలంటే చులకన భావమా? అంటూ ప్రశ్నించారు.
● అరకు ఎంపీ గుమ్మా తనూజారాణి డిస్ట్రిక్ డెవలప్‌మెంట్ కో ఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్‌పర్సన్ అని రాజన్నదొర గుర్తుచేశారు. ఒత్తిడులకు తలొగ్గి, ప్రొటోకాల్‌ను విస్మరించడం తగదన్నారు.
సాలూరులో వందపడకల ఆస్పత్రి
భవనానికి కరోనా సమయంలో
శంకుస్థాపన చేసిన బొత్స సత్యనారాయణ
ఆ శిలాఫలకం కనుమరుగుచేయడం
సరికాదు
ఆస్పత్రి ప్రారంభోతవ్సంలో గిరిజన ఎంపీని ఆహ్వానించడంలో అవమానించారు
మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర


