పార్వతీపురం రూరల్: టీనేజ్ గర్భాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన అవసరమని జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక గాయత్రి, ఎస్.ఎస్.ఎస్. డిగ్రీ కళాశాలల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్ల లోపు గర్భం దాల్చడం వల్ల బాలికల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా విద్య, భవిష్యత్తుకు ఆటంకం కలుగుతుందన్నారు. ప్రతి అమ్మాయి కనీసం డిగ్రీ పూర్తి చేయాలని, బాల్య వివాహాల నివారణలో సమాజం బాధ్యత వహించాలని సూచించారు. లీగల్ ఆఫీసర్ పి.శ్రీధర్ మాట్లాడుతూ.. పోక్సో చట్టం–2012, గృహహింస, వరకట్న వేధింపులు, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టాలపై వివరించారు.
చైల్డ్ లైన్ నంబరు 1098 ప్రాధాన్యతను, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్– 2006 నిబంధనలను పీఓలు ఎం.ఎ.నాయుడు, ప్రసాదరావు వివరించారు. పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రామారావు, కౌన్సిలర్ తవిటినాయుడు, కళాశాల ప్రిన్సిపాళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.


