బస్టాండ్లు బాగుండాలి.. సేవలు మెరుగుపడాలి! | - | Sakshi
Sakshi News home page

బస్టాండ్లు బాగుండాలి.. సేవలు మెరుగుపడాలి!

Mar 27 2026 9:24 AM | Updated on Mar 27 2026 9:24 AM

బస్టాండ్లు బాగుండాలి.. సేవలు మెరుగుపడాలి!

పార్వతీపురం రూరల్‌ : జిల్లాలోని ఆర్టీసీ బస్‌ స్టేషన్లు ప్రయాణికులకు ఆహ్లాదాన్ని ఇచ్చేలా, అన్ని రకాల మౌలిక వసతులతో ఉండాలని కలెక్టర్‌ డా. ఎన్‌.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. పార్వతీపురం ఆర్టీసీ బస్టాండ్‌ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. ప్లాట్‌ఫారమ్‌లు, తాగునీటి వసతి, విక్రయ దుకాణాలు, మరుగుదొడ్లు, పారిశుధ్య పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ప్రయాణికులతో నేరుగా ముచ్చటించి ఆర్టీసీ సేవలపై వారి సంతృప్తిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. బస్టాండ్‌ ఆవరణలో ఎక్కడా నీరు నిల్వ ఉండకూడదని, చెత్తాచెదారం లేకుండా ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని సూచించారు. వేసవి దృష్ట్యా తాగునీటి లభ్యతతో పాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని, మరుగుదొడ్ల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా లైట్లు, ఫ్యాన్లు పనిచేసేలా చూడాలని, బస్సుల రాకపోకలపై సిబ్బంది మర్యాదపూర్వకంగా కచ్చితమైన సమాచారం అందించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. బస్‌ స్టేషన్‌ అనేది ప్రజలకు ఒక దేవాలయం వంటిదని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. దుకాణాల్లో గడువు ముగిసిన వస్తువులను విక్రయించినా, అధిక ధరలకు అమ్మినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్వహించే ప్రజా స్పందనలో ప్రయాణికులు శత శాతం సంతృప్తి చెందేలా సేవలు ఉండాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి, జిల్లా ప్రజా రవాణా అధికారి కె.శ్రీనివాస రావు, డీఎం ఎస్‌.లక్ష్మణరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఆర్టీసీ ప్రాంగణంలో కలెక్టర్‌ తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement