విజయనగరం ఫోర్ట్: జిల్లాలో మాతృ, శిశు మరణాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మరణాలకు జవాబుదారీతనం ఉండాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం అక్టోబర్ నుంచి ఫిబ్రవరి నెల వరకు జరిగిన మాతృ, శిశు మరణాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరణాలు సంభవించకుండా ప్రజల ప్రాణాల రక్షణ కోసం వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. ఒక్కొక్క మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని మరణాల విషయంలో అంబులెన్సు ఆలస్యం కావడం, నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం, ప్రిస్కప్షన్ లేకుండా మందులు అమ్మడం ఇలాంటి కారణాలు గుర్తించి ఆయా మరణాలపై సమగ్ర నివేదికను ఇవ్వాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పద్మశ్రీ రాణి, ఘోషాస్పత్రి గైనికాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ అరుణ శుభశ్రీ , డీఐఓ డాక్టర్ రెడ్డి అచ్చుతకుమారి, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కె.రాణి, ఐసీడీఎస్ పీడీ బాలామణి తదితరులు పాల్గొన్నారు.
మ్యుటేషన్ తిరష్కరణలు తగ్గాలి
విజయనగరం: జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. పట్టాదారు పాసుపుస్తకాలు, రీసర్వే, 22 ఏ భూములు తదితర రెవెన్యూ అంశాలపై దిశానిర్దేశం చేశారు. వీటిపై జేసీ సేతు మాధవన్‌తో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం, రీసర్వే వేగవంతం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఒక్క తప్పుకూడా లేకుండా పాసుపుస్తకాలను రూపొందించాలని, రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని స్పష్టం చేశారు. అదేవిధంగా మ్యుటేషన్లను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని దీనిలో జిల్లా వెనుకబడి ఉందని దానిని మెరుగుపరచాలని కోరారు.
జిల్లాలో గ్యాస్ కొరత లేదు
జేసీ సేతుమాధవన్ మాట్లాడుతూ జిల్లాలో ఎల్‌పీజీ కొరత లేదని అయినా పత్రికలలో కొరత ఉన్నట్టు విరుద్ధ వార్తలు వస్తున్నాయని వాటిని పరిశీలించాలని సూచించారు. ఇళ్లకు సప్లై చేసే సిలిండర్లు కొరత లేకుండా, పాఠశాలలు సాంఘిక సంక్షేమ, బీసీ వెల్ఫేర్, వసతిగృహాలు తదితర వాటికి కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ఐ.వి.ఆర్.ఎస్, ఇంటర్ డిపార్టుమెంటల్ అంశాలపై జిల్లా అధికారులతో జేసీ సమీక్షించారు. సమావేశంలో డీఆర్‌ఓ సత్తిబాబు, ఎస్‌డీసీఈ మురళి , ఆర్‌డీఓలు పాల్గొన్నారు. వర్చువల్‌గా తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.


