తెరపైకి.. పునర్విభజన! | - | Sakshi
Sakshi News home page

తెరపైకి.. పునర్విభజన!

Mar 25 2026 7:17 AM | Updated on Mar 25 2026 7:17 AM

తెరపైకి.. పునర్విభజన! పార్వతీపురం పార్లమెంట్‌ ఏర్పడినట్లేనా?

అసెంబ్లీ స్థానాలు

4 నుంచి 6..?

సాక్షి, పార్వతీపురం మన్యం: ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న నియోజకవర్గాల పునర్విభజన అంశం ఎట్టకేలకు తెరపైకి వచ్చింది. పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం నుంచి స్పష్టమైన సంకేతాలు రావడం.. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లోనే దీనిపై బిల్లు పెట్టనుండడంతో జిల్లా రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ మొదలైంది. విభజన పూర్తయిన తర్వాత తమకు అనుకూల రిజర్వేషన్‌ వస్తుందని కొందరు, నియోజకవర్గాల పెంపుతో తమకూ సీటు పక్కా అని మరికొందరు ఆశ పడుతుంటే... మరోవైపు ఇన్నాళ్లూ ఇప్పుడున్న నియోజకవర్గ సీటుపైనే రుమాలు వేసుకుని, ఎదురుచూస్తున్న ఇంకొందరు నాయకులు నిరాశకు లోనవుతున్నారు.

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల విభజన తర్వాత పార్వతీపురం (ఎస్సీ), సాలూరు, కురుపాం, పాలకొండ (ఎస్టీ) నియోజకవర్గాలుగా పార్వతీపురం మన్యం ప్రత్యేకంగా ఏర్పడింది. గిరిజన ప్రాంతాల ప్రాతిపదికన ఏర్పడిన జిల్లా కావడంతో అరకు పార్లమెంట్‌ నియోజకవర్గంలోనే పార్వతీపురం మన్యం కూడా కలిసింది. ప్రస్తుతం ఉన్న అరకు పార్లమెంట్‌ స్థానం రెండు జిల్లాలు, ఏడు అసెంబ్లీ స్థానాలతో ఉంది. భౌగోళికంగా అరకు సుదూర ప్రాంతంలో ఉండడం వల్ల కొన్ని వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. పార్వతీపురం పేరుతో మన్యం జిల్లా యూనిట్‌గా ఒక పార్లమెంట్‌ స్థానం ఇవ్వాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. పార్వతీపురం, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాలను కలిపి ఒక ఎంపీ స్థానాన్ని ఎస్టీలకు కేటాయించాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. పార్లమెంట్‌ నియోజకవర్గం ఒక జిల్లా చొప్పున పరిగణనలోకి తీసుకుంటే.. పార్వతీపురానికి ప్రత్యేకంగా ఒక ఎంపీ స్థానం ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో రిజర్వేషన్‌ ప్రాతిపదికన ఎస్టీకి ఇస్తారా, జనరల్‌ చేస్తారా? అన్న సందేహాలు నెలకొంటున్నాయి. అరకు, పోలవరం ఎస్టీలకు కేటాయిస్తే.. ఇక్కడ జనరల్‌ అవుతుందని కొంతమంది భావిస్తున్నారు.

పార్వతీపురం మన్యం జిల్లా జనాభా సుమారు 9.25 లక్షల మంది. 2 లక్షల జనాభాకు ఒక నియోజకవర్గం కనీసం ఉండాలి. పునర్విభజన జరిగి, అసెంబ్లీ స్థానాలు పెరిగితే.. ప్రస్తుతం ఉన్న నాలుగు నియోజకవర్గాలు ఆరు అయ్యే అవకాశాలున్నాయి. జిల్లా కేంద్రమైన పార్వతీపురం నియోజకవర్గం(ఎస్సీ).. జనరల్‌ స్థానం కావచ్చని ఎప్పటి నుంచో రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక్కడ కొప్పల వెలమ సామాజిక వర్గం అధికం. అన్ని వర్గాల వారూ నివసిస్తున్నారు. పునర్విభజన తర్వాత జనరల్‌ అయితే, తమకు లాభిస్తుందని కొంతమంది ఆశలు పెట్టుకున్నారు. పార్వతీపురం అర్బన్‌, మండలంతో కలిపి గరుగుబిల్లి మండలం/కొమరాడలో కొంతభాగం కలిపి ఒక నియోజకవర్గంగా ఏర్పడనుందన్న చర్చ నడుస్తోంది. సీతానగరం, బలిజిపేట, మక్కువ/బాడంగి (ప్రస్తుతం విజయనగరం జిల్లా) కలిపి ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పడే అవకాశాలూ ఉన్నాయి. గతంలో బలిజిపేట, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, వీరఘట్టం మండలాలతో ఒక నియోజకవర్గం చేయాలన్న ప్రతిపాదన వెళ్లింది. కురుపాం, సాలూరు ఎస్టీ అసెంబ్లీ స్థానాలుగా ఉండగా.. పాలకొండ నియోజకవర్గం ఎస్సీలకు.. సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, భామిని, కురుపాం కలిపి ఒక నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వ్‌ చేయవచ్చన్న వాదన రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

ఎవరి ‘అదృష్టం’ మారనుందో?

డీ లిమిటేషన్‌తో మారనున్న జిల్లా రాజకీయ ముఖచిత్రం

ఆశావహులకు ఆశ.. నిరాశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement