ఉద్యోగాల వల.. చిక్కారంటే విలవిల | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల వల.. చిక్కారంటే విలవిల

Mar 25 2026 7:17 AM | Updated on Mar 25 2026 7:17 AM

నిత్యం వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు

బాధితులకు కలగని న్యాయం

● ఎల్‌.ప్రభావతి అనే గిరిజన మహిళకు గుమ్మలక్ష్మీపురం మండలం మండ గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో అటెండర్‌ ఉద్యోగం కల్పిస్తామని ఓ సంస్థ చెప్పింది. విద్యాధరి హెల్త్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ పేరిట నియామక ఉత్తర్వుల లేఖ కూడా ఇచ్చారు. జీతం రూ.15 వేలు.. గతేడాది డిసెంబరులో ఇది జరగగా.. అంతకుముందు, అదే ఏడాది ఆగస్టు నెలలో ఆమెకే కురుపాంలోని ఆశ్రమ పాఠశాలలో వాలంటీరు(అటెండర్‌)గా నియమిస్తూ జేకే రూరల్‌–అర్బన్‌ ఎడ్యుకేషన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ పేరిట నియామక లేఖ వచ్చింది. ఈ ఉద్యోగం కోసం ప్రభావతి భర్త చెల్లించిన మొత్తం రూ.1.70 లక్షలు. కొద్దిరోజులు పోయాక గానీ.. ఆ భార్యాభర్తలకు తెలియలేదు. తాము మోసపోయామని! నాటి నుంచి న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

● స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్రలో ఉద్యోగాల పేరిట మోసపోయిన సుమారు 70 మంది బాధితులు నేటికీ అధికారులు, పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడా వీరికి న్యాయం జరగడం లేదు. దాదాపు రూ.2 కోట్లకుపైగా నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఓ సంస్థ పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. మూడు నెలలు వీరితో విధులు చేయించినా, అందుకు సంబంధించిన జీతాలు కూడా లేవు. పైగా, పనుల సమయంలో పరికరాలు, ఇతర అవసరాల కోసం సొంత డబ్బులు పెట్టుకున్నామని బాధితులు చెబుతున్నారు. కురుపాం నియోజకవర్గంలో ఒక మహిళా ప్రజాప్రతినిధి ద్వారా ఈ ఉద్యోగాల కోసం తమకు తెలిసిందని పలువురు తెలిపారు.

సాక్షి, పార్వతీపురం మన్యం:

జిల్లాలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువత మోసపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగమని ఆశ చూపి కొంతమంది వివిధ సంస్థల పేరుతో నియామక పత్రాలు సృష్టిస్తున్నారు. పాఠశాలలు, ఆస్పత్రులు, పంచాయతీలు, ఇతర శాఖల్లో పోస్టులంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ప్రధానంగా నేరుగా ప్రభుత్వ శాఖలని చెప్పకుండా.. ఓ సంస్థ ద్వారా స్వచ్ఛందంగా సహాయకారులుగా పనిచేస్తారని చూపుతున్నారు. స్వచ్ఛంద సర్వీసు అనుకుని.. ఆయా శాఖల అధికారులు, ప్రధానోపాధ్యాయులు సైతం పని చేసేందుకు అనుమతిస్తున్నారు. నెలలు గడిచి, జీతాల వద్దకు వస్తేనే గానీ అసలు విషయం వెలుగులోకి రావడం లేదు. ఇలా మోసపోయిన వారిలో గిరిజన యువతే అధికంగా ఉంటున్నారు. ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేసిన గిరిజన నిరుద్యోగులు సులువుగా వీరి ఉచ్చులో పడుతున్నారు. స్థానికంగా ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధులు, చోటామోటా నాయకుల పాత్ర ఇందులో ఉంటోందన్న ఆరోపణలు బాధితుల మాటల ద్వారా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement