29తో ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేత | - | Sakshi
Sakshi News home page

29తో ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేత

Mar 25 2026 7:17 AM | Updated on Mar 25 2026 7:17 AM

పార్వతీపురం: ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఈ నెల 29తో మూసివేయనున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 281 రైతు సేవా కేంద్రాల ద్వారా 2.68 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలుచేసి, లక్ష్యానికి అనుగుణంగా ప్రక్రియను పూర్తిచేశామని, 42,309 మంది రైతుల ఖాతా ల్లోకి రూ.617 కోట్లు నగదును జమచేసినట్టు వెల్లడించారు. ఎవరైనా ధాన్యం విక్రయించకపోతే సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో విక్రయించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు.

వేతనదారులకు ‘సాంకేతిక’ శాపం

జిల్లాలో ఉపాధి పనుల్లో పాల్గొంటున్నది 39,500 మంది వేతనదారులు

ఫేస్‌ ఐడీ అమలైంది 21వేల మందికే..

మిగిలిన 18,500 మందికి మస్తర్లు పడని వైనం

ఆవేదనలో వేతనదారులు

సీతానగరం: ఉపాధిహామీ పథకంలో సాంకేతిక లోపం వేతనదారులకు శాపంగా మారింది. పనికి వెళ్లినా ఫేస్‌ ఐడీ నమోదుకావడంలేదు. ఫలితం.. మస్తరు పడక వేతనం కోల్పోయే పరిస్థితి. మస్తర్లలో అవకవతవకలు నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫేస్‌ ఐడీ నమోదును అమలుచేస్తోది. పనిచేసే చోట ఉపాధి సిబ్బంది వేతనదారు ఫేస్‌ను ఫొటోతీసి మస్తరు వేయాలి. ఇది మంచిదే అయినా వేతనదారులందరికీ ఫేస్‌ ఐడీ నమోదు కాకపోవడం ఇబ్బందిగా మారింది. జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న ఉపాధిహామీ పనుల్లో 39,500 మంది వేతనదారులు పాల్గొంటున్నారు. వీరిలో 21వేల మందికే ఫేస్‌ ఐడీలు నమోదయ్యాయి. వారికి మాత్రమే మస్తర్లు పడుతున్నాయి. మిగిలిన 18,500 మంది పనులకు వెళ్తున్నా ఫలితం సున్నాగా మారింది. మస్తర్లు పడకపోవడంతో వేతనాలను నష్టపోతున్నారు. జిల్లా స్థాయి అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

మిమ్స్‌ డైరెక్టర్‌కు జాతీయ అవార్డు

నెల్లిమర్ల: మిమ్స్‌ వైద్యకళాశాల అకడమిక్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వేణుగోపాలరావు తన్నీరు అనస్తీషియా బోధన విభాగంలో అందిస్తున్న సేవలకు తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్మెంట్‌ (ఎన్‌ఎఫ్‌ఈడీ) సంస్థ ప్రతినిధులు అవార్డును ప్రకటించారు. ఇటీవల కోయంబత్తూర్‌లో జరిగిన గ్లోబల్‌ కాంక్లేవ్‌ ఆన్‌ సస్టైనబుల్‌ డెవలప్మెంట్‌ సదస్సులో 39వ సమగ్ర జాతీయ అవార్డు–2026ను సంస్థ చైర్మన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఆర్‌.గణేషన్‌ చేతుల మీదుగా వేణుగోపాలరావు అందుకున్నారు. ఆయనకు జాతీయస్థాయి అవార్డు రావడం పట్ల మిమ్స్‌ చైర్మన్‌ అల్లూరి సత్యనారాయణరాజు, మేనేజింగ్‌ ట్రస్టీ డాక్టర్‌ ప్రవీణ్‌ వర్మ తదితరులు హర్షం వ్యక్తంచేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు.

క్షయ రహిత జిల్లాగా

మార్చడమే లక్ష్యం

విజయనగరం ఫోర్ట్‌: క్షయ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి బాధితులకు మెరుగైన చికిత్స అందించడంతో విజయనగరాన్ని క్షయరహిత జిల్లాగా తీర్చిదిద్దవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ ఎస్‌.జీవనరాణి అన్నారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో మంగళవారం టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ 100 రోజుల ప్రత్యేక కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైరిస్క్‌ గ్రామాలు, జన సామర్థ్యం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, వ్యాధిసోకే ప్రమాదం ఉన్న వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించి స్క్రీనింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిరోజూ ఒక హైరిస్క్‌ గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి జిల్లాలోని అన్ని ప్రాంతాలను కవర్‌చేస్తామన్నారు. హ్యాండ్‌ హెల్త్‌ ఎక్సరే పరికరంతో క్షేత్ర స్థాయిలోనే త్వరితగతిన పరీక్షలు నిర్వహించే వీలుంటుందని తెలిపారు. పరీక్షలు చేయించుకున్న ప్రతి వ్యక్తి వివరాలను తప్పనిసరిగా నిక్షయ్‌ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ కె. రాణి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సూర్యనారాయణ, డీఐఓ రెడ్డి అచ్చుతకుమారి, ఎన్‌సీడీ పీఓ సుబ్రమణ్యం, ఐసీడీఎస్‌ పీడీ బాలామణి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement