ఉద్యానరంగ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

ఉద్యానరంగ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌

Mar 25 2026 7:17 AM | Updated on Mar 25 2026 7:17 AM

చదువుతో పాటు కళలకు ప్రాధాన్యమివ్వాలి

కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి

గరుగుబిల్లి: ప్రస్తుత సమాజంలో కృత్రిమ మేథ(ఏఐ), కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చినా ఉద్యాన రంగానికి ఉన్న ప్రాముఖ్యత, ఆవశ్యకత ఎప్పటికీ తగ్గదని, ఉద్యాన రంగ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి అన్నారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉద్యాన కళాశాలలో మంగళవారం నిర్వహించిన 12వ అంతర్‌ కళాశాల సాంస్కృతిక, సాహిత్య సమ్మేళన ప్రారంభోత్సవంలో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో వైద్యరంగంలో కూడా రోగ నిర్ధారణ నుంచి శస్త్ర చికిత్సల వరకు కంప్యూటర్లే చేసేరోజులు వస్తాయన్నారు. కానీ మొక్కల పెంపకం, ఉద్యాన రంగం వంటి అంశాల్లో మానవ ప్రమేయం, విద్యార్థుల నైపుణ్యం ఎంతో కీలకమన్నారు. ఉద్యాన రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులు తమ ప్రతిభను చాటుకోవాలన్నారు. ఉద్యాన వన విద్య ప్రకృతికి అత్యంత సమీపంలో ఉందని, ఈ రంగంలో మానసిక ప్రశాంతతను పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా తమలోని దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు కళలు, క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. మన్యం జిల్లాలో విద్యార్థుల కోసం ‘మన్యం డాన్స్‌’, ‘ఆనందలహరి’ వంటి కార్యక్రమాలను రూపొందించామని, ప్రతీ వారం విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించుకునేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. విశ్వ విద్యాలయం వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ ధనుంజయరావు మాట్లాడుతూ ఏఐ వచ్చినా ప్రకృతి రంగానికి డిమాండ్‌ ఎప్పుడూ తగ్గదన్నారు. మొక్కల పెంపకంలో అధునాతన సాంకేతికతను వినియోగించుకునేందుకు ఉద్యానరంగం ఎంతో దోహదపడుతుందన్నారు. కళాశాలలో విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు మనస్సుకు దగ్గరగా చేరువయ్యాయన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ కళా ప్రదర్శనలతో అందరినీ ఆకర్షించారు. ఇందులో ఉత్తమ ప్రదర్శనలు చేసిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్‌లో మరిన్ని ప్రదర్శనలు ఇవ్వాలని ఆయన ప్రోత్సహించారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్‌కుమార్‌ రెడ్డి, సబ్‌కలెక్టర్‌ ఆర్‌.వైశాలి, డీఈఓ పి.బ్రహ్మాజీరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement