రామభద్రపురం: స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయంలో అల్యూమినియం విద్యుత్ వైర్లు సోమవారం రాత్రి చోరీకి గురయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయానికి వేసిన తాళం విరగ్గొట్టి అందుల్లో ఉన్న విద్యుత్ వైర్లు దొంగలు చోరీ చేశారు. మంగళవారం ఉదయం కార్యాలయం శుభ్రపరిచేందుకు వెళ్లిన సిబ్బంది తాళం విరిగ్గొట్టి ఉండడం చూసి పక్కనే ఉన్న సబ్‌స్టేషన్ షిప్ట్ ఆపరేటర్‌కు చెప్పారు. వెంటనే షిప్ట్ ఆపరేటర్ విద్యుత్ శాఖ ఏఈ సత్యనారాయణకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలిసిన వెంటనే ఏఈ కార్యాలయానికి చేరుకుని పరిశీలించిన అనంతరం సుమారు 3.2 కిలోమీటర్లు సరిపడా ఉన్న అల్యూమినియం వైరు చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు విద్యుత్ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం ఏఈ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి.ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వక్ఫ్‌బోర్డ్ మాజీ అధ్యక్షుడు కరీమ్ మృతికి సంతాపం
విజయనగరం టౌన్: వక్ఫ్‌బోర్డ్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది అబ్దుల్ కరీమ్ (59) సోమవారం రాత్రి మృతి చెందారు. ముస్లింల అభ్యున్నతికి విశేషంగా కృషి చేయడమే కాకుండా సమాజ సేవకులుగా, న్యాయవాద వృత్తిలో రాణిస్తూ అందరి మన్ననలు పొందిన అబ్దుల్ కరీమ్ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందడం పట్ల ముస్లిం పెద్దలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాడ సానుభూతి తెలిపారు.


