‘అగస్త్య జిజ్ఞాస’ జాతీయ పోటీలకు పూల్‌బాగ్ విద్యార్థులు
విజయనగరం అర్బన్: అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18, 19వ తేదీల్లో పూణెలో నిర్వహిస్తున్న ‘అగస్త్య జిజ్ఞాస’ జాతీయస్థాయి పోటీలకు పట్టణానికి చెందిన పూల్‌బాగ్ జెడ్పీ స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.రఘురామరాజు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ 23న జరిగిన రాష్ట్రస్థాయి వర్చువల్ పోటీలలో పాఠశాల విద్యార్థులు సీహెచ్.వెంకటేష్, ఆర్.గగన్‌దీప్‌లు గైడ్ టీచర్ కె.శైలజ మార్గదర్శకత్వంలో రూపొందించిన ‘రోవర్ ఫార్మర్’ ప్రాజెక్టు జాతీయస్థాయి పోటీకి ఎంపికై ందని తెలిపారు. ఏఐ సాంకేతికతను వినియోగించి రూపొందించిన ఈ ప్రాజెక్టు ద్వారా రైతులు మొబైల్ ఫోన్ సహాయంతో రోవర్‌ను నియంత్రిస్తూ పొలంలోని ఉష్ణోగ్రత, తేమ, కార్బన్‌డై ఆకై ్సడ్ శాతం వంటి వివరాలను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా లైవ్ వీడియో ప్రసారం ద్వారా పంట స్థితిని పరిశీలించవచ్చు. రైతుల శ్రమను తగ్గిస్తూ వ్యవసాయాన్ని సాంకేతికతో సమర్థవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు రూపొందించినట్లు విద్యార్థులు వివరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి యూ.మాణిక్యంనాయుడును విద్యార్థులు కలిసి ప్రాజెక్టు వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, గైడ్ టీచర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని డీఈఓ అభినందించారు. డీఈఓను కలిసిన వారిలో ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకుడు డి.ఈశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.


