పూజలందుకోవయ్యా ‘శివయ్య’
పార్వతీపురం రూరల్ : ప్రకృతి ఒడిలో పరమశివుడు.. కోరి వచ్చిన భక్తుల గుండెల్లో గరళకంఠుడు! పచ్చని చెట్ల నడుమ, ఎత్తైన కొండల కోనల్లో కొలువై, భక్తుల ఇష్టదైవంగా విరాజిల్లుతున్న అడ్డపుశీల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధి మహాశివరాత్రి మహోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శనివారం సాయంత్రానికే ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రంతో అడ్డపుశీల గిరి శిఖరాలు మారుమోగుతున్నాయి. ఉత్తరాంధ్ర కాశీగా, భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలుగొందుతున్న ఈ క్షేత్రం, ఆదివారం జరగనున్న శివరాత్రి పర్వదినం వేళ భక్తజన సంద్రం కానుంది.
స్వయంభూలింగ దర్శనం..
సర్వపాప హరణం
అడ్డపుశీల కొండల మధ్య స్వయంభూలింగంగా వెలిసిన ఆ విశ్వేశ్వరుని దర్శనం కాశీ విశ్వనాథుని దర్శనంతో సమానమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాశీ వెళ్లలేని సామాన్య భక్తులకు ఈ క్షేత్రం ఒక దివ్యధామం. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో, సుగంధ పుష్పాలతో నయనానందకరంగా అలంకరించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా అర్ధరాత్రి వేళ జరిగే మహా లింగోద్భవ కాల పూజల కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు.
సకల వసతులు.. సాఫీగా దర్శనం
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ, జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. ఎండ తీవ్రత దృష్ట్యా ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు వేయడమే కాకుండా, తాగునీరు, మజ్జిగ పంపిణీకి స్వచ్ఛంద సంస్థలు నడుం బిగించాయి. క్యూలైన్లలో తోపులాటలు జరగకుండా పోలీస్ బందోబస్తును కట్టుదిట్టం చేశారు. భక్తులు ఆదివారం రోజంతా ఉపవాస దీక్షలతో, రాత్రంతా జాగరణలతో ముక్కంటిని కొలిచేందుకు సిద్ధమయ్యారు. గిరిజన ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చే భక్తకోటితో నడక బాట శివనామ స్మరణతో పులకించిపోనుంది.


