కాస్త ఊరట.. అమలైతేనే లెక్క!
● విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ప్లాన్‌లో భాగంగా పది జిల్లాలను ఈ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. అందులో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలు కూడా ఉన్నాయి. రూ.28 వేల కోట్లతో ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు చేశారు. మాన్యుఫాక్చరింగ్, సర్వీసెస్, మౌలిక వసతులు, పట్టణీకరణ, వ్యవసాయ రంగాల్లో ప్రాజెక్టులు ఏర్పాటవుతాయని ప్రభుత్వం చెబుతోంది. అందులో జిల్లాకు సంబంధించి ఏ మేరకు ప్రయోజనం ఉంటుందో స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు నిధులను కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్‌రంగాల నుంచి కేటాయించుకుంటామని చెప్పారు.
● జిల్లాకు ఒక సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్ రానుంది. దీనివల్ల డిజిటల్ అరెస్టులు, ఆన్‌లైన్, సైబర్ మోసాల్లో త్వరితగతిన కేసులు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. పోలీసు శాఖకు మొత్తంగా 3 వేల వాహనాలు రానున్నాయి. ఇందులో జిల్లాకు సంబంధించి కొన్ని వాహనాలు వచ్చే వీలుంది.
● ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు.. పార్వతీపురం నియోజకవర్గం నర్సిపురంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ, పార్కు నిర్మాణానికి ఉన్నతాధికారులకు జిల్లా నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లాయి.
పోలీసు సిబ్బందికి బడ్జెట్‌లో ఊరటనిచ్చారు. బకాయి ఉన్న టీఏ, డీఏ, సెలవు సంబంధిత బకాయిలు, వైద్య రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల కోసం రూ.500 కోట్లు కేటాయించారు. దీనివల్ల జిల్లాలోని సుమారు 900 మంది పోలీసు ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఇదే సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను విస్మరించారు. సీపీఎస్ రద్దు, పీఆర్‌సీ, ఐఆర్ వంటి హామీల ఊసు లేకపోయింది. దీనివల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర నిరాశ కనిపిస్తోంది. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సుమారు 12,500 మంది, ఉపాధ్యాయులు 9,700 మంది ఉన్నారు. బడ్జెట్ తీరుతో వారంతా నిరుత్సాహానికి గురయ్యారు.


