భయంకరి సంచారం
సీతానగరం: మండలంలోని పలుగ్రామాల్లో సంచరిస్తున్న 8 ఏనుగుల గుంపు అరకొర సాగునీటితో రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పంటలను నాశనం చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది జనవరి రెండవవారంలో మక్కువ మండలం కంచెవానివలస నుంచి సీతానగరం మండలంలోని బగ్గందొరవలస. బళ్ల కృష్ణాపురం పొలాల్లోకి చేరుకున్న 8 ఏనుగుల గుంపు బళ్లకృష్ణాపురం గ్రామానికి చెందిన వెంకటరమణ, పరిశినాయుడు, తదితర ముగ్గురు రైతులకు చెందిన కొబ్బరి, పామాయిల్ మొక్కలు, వరినారు ధ్వంసం చేశాయి. అనంతరం బగ్గందొరవలస తోటలోకి చేరుకున్న ఏనుగుల గుంపు తోటలు, అపరాల పంటలు సాగుచేస్తున్న పొలాల్లో గోతులు చేయడంతో అపారమైన నష్టం వాటిల్లింది. అలాగే బక్కుపేటలో మూడు కుటుంబాలకు చెందిన పామాయిల్ మొక్కల తోటలో చొరబడి ధ్వంసం చేయడంతో పాటు రెండు విద్యుత్ మోటార్లకు సంబంధించిన పైప్‌లైన్లు, విద్యుత్ మోటార్లను చిందరవందర చేయడం, బోరు పైప్ విరగ్గొట్టడం వల్ల రైతులు అవస్థలు పడుతున్నారు. ఆర్.వెంకంపేటలో రెండు కుటుంబాలవారు ఇంటి వాడుక నిమిత్తం గడ్డి కుప్పల్లో భద్రపర్చుకున్న 30 బస్తాల ధాన్యం తినేశాయి. అలాగే తామరఖండి, చినభోగిలి గ్రామాల్లో 6 ఎకరాల విస్తీర్ణంలో చెరకు, 4 ఎకరాల్లో మొక్కజొన్న.పామాయిల్ తొక్కలను ధ్వంసం చేయడంతో రైతులు లబోదిమంటున్నారు.ఏనుగుల కదలికలను గమనించడానికి, ఏనుగులు సంచరించే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడానికి సెక్షన్ ఆఫీస్ పర్యవేక్షణలో సదస్సులు నిర్వహిస్తు, ఏనుగుల గుంపుతో అటవీ శాఖ సిబ్బంది నిరంతరం ఉండాల్సి వస్తోంది. ఏనుగుల గుంపు వల్ల సంభవించిన పంటనష్టాల్ని అటవీశాఖ, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు అంచనా వేస్తున్నారు.పంటనష్ట పోయిన రైతులకు ఎప్పుడు పరిహారం ఇస్తారోనని ఎదురు చూస్తున్నారు.పంటనష్టం ఇవ్వకపోతే జీవనోపాధికి ఇబ్బందులు తప్పవని రైతులు వాపోతున్నారు. పార్వతీపురంమన్యం జిల్లా రేంజ్ అధికారి రవి, సెక్షన్ అధికారి మనోజ్‌కుమార్, బీట్ ఆఫీసర్ సతీష్,సిబ్బంది ఏనుగుల గుంపు కదలికలను ఆదివారం భౌతికంగా పరిశీలించారు.
పొల్లాల్లో తిరుగుతున్న 8 ఏనుగులు
20 రోజులుగా ధ్వంసం చేస్తున్న పంటలు
20 ఎకరాల్లో మొక్కజొన్న
15 ఎకరాల్లో పామాయిల్ తోట
10 ఎకరాల్లో తోటలు ధ్వంసం
మూడు ఎకరాలకు సరిపడా వరినారు
6 ఎకరాల్లో చెరకుపంట నాశనం
ఆందోళనలో రైతులు
పంటనష్టాన్ని అంచనా వేస్తున్న అధికారులు
భయంకరి సంచారం


