ముగిసిన ‘మై భారత్’ క్రీడాపోటీలు
పార్వతీపురం రూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పార్వతీపురం సర్కిల్ ఇనన్ స్పెక్టర్ బి.వెంకటరావు సూచించారు. జిల్లా యువజన అధికారి ప్రేమ్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన ‘మై భారత్’ జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐ విజేతలకు ట్రోఫీలు, మెడల్స్, వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని, విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని పేర్కొన్నారు. జిల్లా యువజన అధికారి మాట్లాడుతూ..గతంలో నిర్వహించిన బ్లాక్ లెవెల్ పోటీల విజేతలకు జిల్లా స్థాయి నిర్వహించినట్లు తెలిపారు. వాలీబాల్, ఖోఖో, షార్ట్ పుట్, బ్యాడ్మింటన్, పరుగు పందాల్లో జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చాటారు. కార్యక్రమంలో కోచ్‌లు సంతోష్ కుమార్, కూర్మమ్మ, ప్రసాద్, వలంటీర్లు పాల్గొన్నారు.


