ప్రజ్ఞావికాసం పరీక్ష విజయవంతం
విజయనగరం గంటస్తంభం: భారత విద్యార్ధి ఫెడరేషన్(ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్ధు ల కోసం నిర్వహించిన ప్రజ్ఞావికాసం పరీక్ష విజయవంతంగా ముగిసింది. తోటపాలెంలో ఉన్న ఎయిమ్ స్కూల్‌లో ఈ పరీక్షను ఆదివారం నిర్వహించారు. పరీక్ష పత్రాలను ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ ఆర్.వి.ఆర్.కె.చౌదరి, ఎయిమ్ స్కూల్ ప్రిన్సిపాల్ బాలాజీ కలిసి ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి డి.రాము మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షకు 4వేల మందికి పైగా విద్యార్ధులు హాజరయ్యారని తెలిపారు. ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్ధుల్లో పరీక్షల పట్ల ఉన్న భయాన్ని తొలగించి, వారి ప్రతిభను వెలికి తీయడ మే లక్ష్యంగా ఈ ప్రజ్ఞావికాసం పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా భవిష్యత్తులో పాలిటెక్నిక్, ఏపీఆర్‌జేసీ వంటి ప్రవేశ పరీక్షలు రాయబోయే విద్యార్ధులకు ఇది ఒక ప్రాక్టీస్ పరీక్షగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ పరీక్షలో జిల్లా స్థాయిలో ప్రథమ స్ధానంలో నిలిచిన విద్యార్థికి రూ.5వేలు, ద్వీతీయ స్థానానికి రూ.3వేలు, తృతీయ స్థానానికి రూ.2వేలు నగదు బహుమతులతో పాటు మెమెంటోలు అందజేయనున్నట్లు వెల్లడించారు.


