మురుగుకాలువ సమస్య పరిష్కరించాలి
● మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్‌కుమార్
భోగాపురం: మండలంలోని ముంజేరు పంచాయతీ సిద్ధార్థ్‌నగర్ (దళితుల) కాలనీ మీదుగా నిర్మించిన మురుగుకాలువ సమస్యను 15 రోజుల్లోగా పరిష్కరించాలని, లేని ఎడల హైకోర్టును ఆశ్రయిస్తామని మాజీ న్యాయమూర్తి, ప్రముఖ హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ అన్నారు. కాలువ సమస్యపై మండల కేంద్రంలో గడిచిన 65 రోజులుగా దళితులు చేపట్టిన నిరాహార దీక్షల శిబిరం వద్దకు ఆయన ఆదివారం చేరుకుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో నేటికీ అశుద్ధ నిర్మూలన కోసం పోరాడాల్సి రావడం మన దౌర్భాగ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు అదేశాలను బేఖాతరు చేస్తున్న కలెక్టర్, డిప్యూటీ ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి, సీఐలపై కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసు వేస్తామని హెచ్చరించారు. దళితుల కోసం రూ.15 లక్షలు ఖర్చు చేయాలా? అని ఎమ్మెల్యే నాగమాధవి అనడం ఆమె వివక్షకు నిదర్శమని, ఆమె ఒక వర్గానికి ఎమ్మెల్యేనా లేక నియోజకవర్గానికి ఎమ్మెల్యేనా అని ప్రశ్నించారు. గ్రామసభలో ఓటర్లందరి ఆమోదం లేకుండా కొంతమందితో మాత్రమే తీర్మానం చేసి కాలువను నిర్మించడం దారుణమన్నారు. 15 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే 10 వేల మందితో కలెక్టర్, ఎస్పీ ఆఫీసులను ముట్టడించి ఆమరణ దీక్ష చేస్తామన్నారు. తానే స్వయంగా వచ్చి ఆ కాలువను కప్పివేస్తానని ఘాటైన హెచ్చరిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత బిడ్డలను ఈ పోరాటంలో ఏకం చేసి, దీనిపై ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు, కమిటీలు వేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ సంఘాలకు చెందిన దళిత నాయకులు పాల్గొన్నారు.


