ఆస్పత్రిలో అధ్వానంగా పారిశుధ్యం
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పారిశుధ్యం ఆధ్వానంగా తయారైంది. వివిధ విభాగాల నుంచి దుర్వాసన వస్తోందని రోగులు, వారి బంధువులు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో ఈవిషయాన్ని రోగులు వెల్లడించారు. మిగతా సేవల కంటే పారిశుధ్యం బాగోలేదని ఎక్కువ శాతం మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. పారిశుధ్యం నిర్వహణ కోసం అధిక మొత్తంలో వెచ్చిస్తున్నప్పటికీ పారిశుధ్యం ఆధ్వానంగా ఉండడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఐవీఆర్‌ఎస్ సర్వేలో పారిశుధ్యం బాగోలేదని రోగులు అధిక సంఖ్యలో చెప్పినప్పటికీ అధికారులు మాత్రం 100కి 96 శాతం పారిశుధ్యం బాగున్నట్లు స్కోర్ ఇవ్వడం గమనార్హం. పారిశుధ్యంతో పాటు మిగతా సేవల పట్ల కూడా పలువురు రోగులు పెదవివిరిచారు.
37.05 శాతం మంది పారిశుధ్యం బాగోలేదని వెల్లడి
2025 డిసెంబర్ నెలలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వివిధ సేవలపై 2882 మందిని ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా సర్వే చేశారు. ఇందులో 37.05 శాతం మంది పారిశుధ్యం బాగోలేదని తెలిపారు. డ్రైనేజేల వద్ద మురుగు నీరు నిల్వ ఉండడంతో దుర్వాసన వస్తుంది. అదేవిధంగా చెత్తాచెదారం సేకరణ కూడా సక్రమంగా జరగడం లేదని రోగులు గుసగుసలు ఆడుకుంటున్నారు. సర్వజన ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణకు నెలకు రూ. 19.96 లక్షలు చెల్లిస్తారు. అయినప్పటికీ పారిశుధ్యం మెరుగుపడకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది.
మిగతా సేవల పట్ల కూడా అసహనం
పారిశుధ్యం నిర్వహణతో పాటు మిగతా సేవల పట్ల కూడా ఐవీఆర్‌ఎస్ కాల్స్‌లో రోగులు పెదవివిరిచారు. వైద్యులు ఓపీల్లో అందుబాటులో ఉంటున్నారా? అన్ని అడగ్గా 22.83 శాతం మంది వైద్యులు అందుబాటులో ఉండడం లేదని తెలిపారు. వైద్యులు రాసిచ్చిన మందులు ఉచితంగా అందుతున్నాయా? అన్న దానిపై 24.68 శాతం మంది మందులు ఉచితంగా అందడం లేదని, ప్రైవేట్ దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. వైద్య సేవలు పొందడానికి ఎవరైనా డబ్బులు అడుగున్నారా? అన్న దానిపై 23.54 శాతం మంది అడుతున్నారని వెల్లడించారు. అన్ని విభాగాల సేవలకు సంబంధించి 27 శాతం మంది సేవలు బాగా అందడం లేదని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. సర్వజన ఆస్పత్రిలో కొంతమంది వైద్యులు ఆస్పత్రికి వచ్చినప్పటికీ టీ, కాఫీ పేరుతో మధ్యలో క్లినిక్‌లకు వెళ్లివస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యాహ్నం 3 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీల్లో వైద్యులు అందుబాటులో ఉండాలి. అయితే కొంతమంది వైద్యులు మధ్యాహ్నం 12, 12:30 గంటలకు వెళ్లిపోయి సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి బయోమెట్రిక్ వేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా కొంతమంది వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన రోగులను వారి క్లినిక్‌లకు తరలించి అక్కడ చికిత్స అందించి ఫీజులు తీసుకున్నట్లు కూడా ఆరోపణులు వినిపిస్తున్నాయి. డ్రెస్సింగ్ చేయడానికి, ఆపరేషన్ థియేటర్స్‌ల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పారిశుధ్యం మెరుగుపడేలా చర్యలు
పారిశుధ్యం మినహా మిగతా సేవల్లో బాగున్నట్లు ఐవీఆర్‌ఎస్ సర్వేలో రోగులు వెల్లడించారు. పారిశుధ్యం కూడా మెరుగుపడేవిధంగా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ అల్లు పద్మజ,
సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి
పారిశుధ్యం బాగోలేదని ఐవీఆర్‌ఎస్ సర్వేలో వెల్లడి
మిగతా సేవల పట్ల కూడ పెదవి విరుపు
అయినప్పటికీ పారిశుధ్యానికి 96 శాతం స్కోర్ ఇచ్చేసిన అధికారులు
నెలకు పారిశుధ్య నిర్వహణకు
లక్షల్లో చెల్లింపు
ఆస్పత్రిలో అధ్వానంగా పారిశుధ్యం
ఆస్పత్రిలో అధ్వానంగా పారిశుధ్యం


