రామఫలాల సీజన్ ప్రారంభం
● దిగుబడులు అంతంతమాత్రమే
● ఒక్కోగుత్తి రూ.70 నుంచి రూ.80కి విక్రయం
● వచ్చేనెల వరకు సీజన్
సీతంపేట: సీతంపేట ఏజెన్సీలో రామఫలాల సీజన్ ఆరంభమైంది. గుత్తుల లెక్కన రామఫలాలను గిరిజనులు విక్రయిస్తున్నారు. ఒక్కోగుత్తిలో 20 నుంచి 40 వరకు రామఫలాలుండగా రూ.70 నుంచి రూ.80 వరకు గిరిజనులు అమ్మకాలు జరుపుతున్నారు. ఒక్కోపండు సరాసరి రూ.3 వరకు గిరిజనులు విక్రయిస్తున్నారు. వచ్చేనెల వరకు ఈ ఫలాల సీజన్ ఉంటుంది. రామానగరం, దేవనాపురం గూడలు, అక్కన్నగూడ, రాజన్నగూడ, మొగదార, కారెం కొత్తగూడ తదితర ప్రాంతాల రైతులు సోమవారం జరిగే సీతంపేట సంతలోను, కుశిమి, కోడిశ, శంభాం ప్రాంత వాసులు శనివారం జరిగే కుశిమిసంతలోను, మర్రిపాడు, పూతికవలస, చిన్నబగ్గ, కీసరజోడు పంచాయతీ వాసులు మర్రిపాడులో బుధవారం జరిగే సంతలోను, పొల్ల, టిటుకుపాయి రైతులు దోనుబాయిలో గురువారం జరిగే సంతలో రామఫలాలు విక్రయిస్తున్నారు. మైదాన ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ గుత్తులు లెక్కన కొనుగోలుచేసి పట్టణ ప్రాంతాల్లో కిలోల లెక్కన రూ.100 నుంచి 150 వరకు విక్రయిస్తామని వ్యాపారులు చెబుతున్నారు. అంతగా పెట్టుబడులు లేకుండా కొండపోడు వ్యవసాయంలో ప్రధానంగా పండే ఈ పంట ఏజెన్సీలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. సేకరణ కష్టమే అయినా ఆదాయం వస్తుందని గిరిజనులు చెబుతున్నారు. అయితే, ఈ ఏడాది దిగుబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయని చెబుతున్నారు.
కొండపోడు వ్యవసాయంలో పండే రామఫలాల సేకరణ కష్టమే. ఎంతకాలం నిల్వ ఉండవు. మైదాన వ్యాపారులు అడిగిన ధరకే పంటను విక్రయిస్తున్నాం.
– చిన్నకడాయి, బొండిగూడ
గత రెండేళ్లుగా అన్ని పంటల్లో నష్టపోతున్నాం. లాభాలు వస్తాయనుకుంటే అవీ రాలేదు. కొండలపైన సేకరించిన అటవీ ఫలసాయాలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం.
– ఎస్.జగ్గారావు, పొంజాడ
వారపు
సంతకు రామఫలాలు తీసుకు
వస్తున్న యువతి
రామఫలాల సీజన్ ప్రారంభం


