యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
తెర్లాం:
యూరియా కోసం తెర్లాం మండలంలోని విజయరాంపురం గ్రామ రైతులు రోడ్డెక్కారు. ఖరీఫ్ సీజన్ నుంచి ఇంతవరకు రైతుకు కేవలం ఒకబస్తా యూరియా మాత్రమే వ్యవసాయ అధికారులు పంపిణీ చేయడంపై మండిపడ్డారు. పంటల సాగుకు కావాల్సిన యూరియా సరఫరా చేయలేని చంద్రబాబు ప్రభుత్వ తీరును దుమ్మెత్తి పోశారు. తెర్లాం వ్యవసాయ కార్యాలయం వద్ద ప్లకార్డులతో శుక్రవారం నిరసన తెలిపారు. గ్రామ సర్పంచ్ బూరి మధుసూదనరావు, రైతులు మాట్లాడుతూ విజయరాంపురం గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని నెమలాం ఆర్‌ఎస్‌కేలో ప్రభుత్వం విలీనం చేసిందన్నారు. విజయరాంపురం గ్రామానికి చెందిన భూములు సుందరాడ, నెమలాం ఆర్‌ఎస్‌కేల పరిధిలో ఉన్నాయని తెలిపారు. అక్కడకు యూరి యా వచ్చినా విజయరాంపురం రైతులకు అందజేయడం లేదని, అక్కడి టీడీపీ నేతలు తమ అనుచరులకు పంపిణీ చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఏఓని కలిసి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని, మండల సర్వసభ్య సమావేశంలో మండలాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని వాపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు దుకాణాల వద్ద అధిక ధరకు యూరియా కొనుగోలు చేయాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. యూరియా అందజేయాలంటూ తహసీల్దార్ జి.హేమంత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఏడాదిగా రైతుకు ఒక బస్తా యూరియా సరఫరాపై మండిపాటు
తెర్లాంలో విజయరాంపురం రైతుల ధర్నా
ప్రభుత్వం తీరును దుమ్మెత్తిపోసిన రైతులు
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు


