హైడ్రో పవర్‌ ప్రాజెక్టు రద్దుకు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

హైడ్రో పవర్‌ ప్రాజెక్టు రద్దుకు డిమాండ్‌

Jan 25 2026 7:24 AM | Updated on Jan 25 2026 7:24 AM

హైడ్ర

హైడ్రో పవర్‌ ప్రాజెక్టు రద్దుకు డిమాండ్‌

ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం

గిరిజనుల బతుకులపై కూటమి నేతల చెలగాటం

తక్షణమే ప్రాజెక్టు రద్దు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించాలి

మక్కువ: దుగ్గేరు పంపుడ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు మంత్రి సంధ్యారాణి ప్రకటించాలని హైడ్రో పవర్‌ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు డిమాండ్‌ చేశారు. మక్కువ మండలం మార్కొండపుట్టి గ్రామంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ వ్యతిరేక కమిటీ కో కన్వీనర్‌ అసిరి అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమావేశంలో కమిటీ కన్వీనర్‌ రాయల సుందరరావు మాట్లాడారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పంచాయతీ స్థాయిలో సదస్సులు నిర్వహిస్తూ ఉంటే కొంత మంది వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అలాంటివారంతా మంత్రి సంధ్యారాణితో ఈ ప్రాంతంలో పవర్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయట్లేదని, జీవో నంబర్‌ 84 విడుదల చేయలేదని, మంత్రివర్గ తీర్మానం జరగలేదని బహిరంగ ప్రకటన విడుదల చేయించాలన్నారు. ఎంతోకాలంగా సురాపాడు మినీ రిజర్వాయర్‌ కావాలని ఎమ్మెల్యేలను, ఎంపీలను కలిసి మొరపెట్టుకుంటే కనీసం పట్టించుకోలేదని వాపోయారు. అడారు గెడ్డ పరివాహక ప్రాంతంలోని రైతులకు నష్టం కలిగించేలా హైడ్రోపవర్‌ ప్రాజెక్టును ఏర్పాటుచేస్తున్నారన్నారు. ప్రాజెక్టు ఏర్పాటైతే తరతరాలుగా కొండల్లో బతుకుతున్న పనసభద్ర, కొదమ పంచాయతీలకు చెందిన అనేక గిరిజన గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుందన్నారు. పచ్చని అడవులు నాశనం అవుతాయని తెలిపారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో నివసించే ప్రజానీకమంతా కలిసి పోరాడాలన్నారు. అనంతరం రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని పోగొట్టి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం, వలసలను అరికడదాం అనే ఆలోచనలను ప్రభుత్వాలు చేయకుండా, ప్రైవేట్‌ వ్యక్తులకు ఉపయోగపడే హైడ్రో పవర్‌ ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులు ఇస్తోందన్నారు. ఇది ఏజెన్సీలోని 5వ షెడ్యూల్‌ ప్రాంతంలో రాజ్యాంగ హక్కులను, పిసా చట్టం, అటవీ హక్కుల చట్టం, ఆదివాసీలు పోరాడి సాధించుకున్న 1/70 చట్టంను ఉల్లంఘించడమేనని స్పష్టంచేశారు. బడా కార్పొరేట్‌ సంస్థలకు మేలుచేకూర్చేలా వేల ఎకరాల జిరాయితీ, అటవీ భూములను కేటాయిస్తూ గిరిజనుల జీవన భద్రతకు, పర్యావరణానికి, సాగునీటి వనరులకు నష్టం కలిగించే హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోసం జీవోలు 51, 13, 2లను విడుదల చేయడం దుర్మార్గమన్నారు. వీటిని తక్షణమే రద్దు చేయాలని, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పటికే వేలాదిమంది గిరిజనులు దీనిపై ఆందోళన చేస్తున్నవిషయాన్ని గుర్తుచేశారు. వీటిని పట్టించుకోకుండా దుగ్గేరు వద్ద చింత గ్రీన్‌ఎనర్జీ అని ప్రైవేట్‌ కంపెనీకి 2000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపుడు స్టోరేజ్‌ హైడ్రోపవర్‌ ప్లాంట్‌కు జీవో 84ను విడుదల చేసిందన్నారు. దీనికి వ్యతిరేకంగా, రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని ఆదివాసీలు, రైతులు, ప్రజాస్వామికవాదులు, మేధావులకు పిలుపునిచ్చారు. గిరిజన గ్రామాలకు, పర్యావరణానికి, పంట భూములకు నష్టం కలిగించే పంపుడ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ ప్లాంట్‌ స్థానంలో, పవర్‌, సౌర విద్యుత్‌ వంటి ప్రత్యామ్నాయ ప్రాజెక్టులపై దష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ కన్వీనర్లు ఊయక ముత్యాలు, ఎం.చెంచు, మార్కొండపుట్టి సర్పంచ్‌ ప్రతినిధి మెల్లిక రాము, తుండ సర్పంచ్‌ సీదరపు నూకరాజు, తదితరులు పాల్గొన్నారు.

హైడ్రో పవర్‌ ప్రాజెక్టు రద్దుకు డిమాండ్‌ 1
1/1

హైడ్రో పవర్‌ ప్రాజెక్టు రద్దుకు డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement