కూటమి పాలనలో అందరికీ అన్యాయం
● టీడీపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు
● మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర
పాచిపెంట : కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల విస్తత స్థాయి సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు గోట్టాపు ముత్యాలునాయుడు అధ్యక్షతన శనివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీడిక రాజన్న దొర, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు మరిచర్ల బాపూజీ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ... కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు గ్రామస్థాయి కమిటీలు ఫిబ్రవరి 18 నాటికి పూర్తి చేయాలన్నారు. పార్టీ నాయకులు. కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో తాను మంజూరు చేయించి తీసుకువచ్చిన రోడ్లు నేడు పూర్తి చేయటానికి, ఆయా గ్రామాల ప్రజలు వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వస్తేనే పూర్తి చేస్తామని మంత్రి సంధ్యారాణి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అలాంటి వారికి 2029లో రానున్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు. టీడీపీ నాయకుల వేధింపులకు భయపడవలసిన అవసరం లేదని, కార్యకర్తలకు, నాయకులకు, ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందన్నారు. మండల పార్టీ సమన్వయకర్త పాచిపెంట వీరంనాయుడు, ఎంపీపీ బి.ప్రమీల వైస్ ఎంపీపీలు మీసాల నారాయణ, కొరిపల్లి రవీంద్రనాథ్, మాజీ జెడ్పీటీసీ గొర్లె గణపతిరావు మాజీ వైస్ ఎంపీపీలు తట్టికాయల గౌరీశ్వరరావు, గండిపల్లి రాము, సీనియర్ నాయకులు దండి ఏడుకొండలు, చింత సీతయ్య, ఇజ్జాడ అప్పలనాయుడు, సత్తారపు రాము తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆదేశాలు పాటించి, పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికే పార్టీలో గుర్తింపు ఉంటుందని నియోజకవర్గ పరిశీలకులు మరిచర్ల బాపూజీనాయుడు అన్నారు. కమిటీల ఏర్పాటు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.


