ప్రజల ముఖాల్లో ఆనందాన్ని చూద్దాం.. : కలెక్టర్
సాలూరు: పరిశుభ్ర వాతావరణం ఏర్పాటు చేసి ప్రజలను ఆరోగ్యకరంగా ఉండేలా చేసి తద్వారా వారి ముఖాల్లో ఆనందాన్ని చూసేందుకు అధికారులు, సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో భాగంగా అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే నిర్వహిస్తున్నారని అధికారులు తూతూమంత్రంగా రోడ్లపై వెళ్లి ఫొటోలు తీసుకుని వచ్చేయరాదని ఆ రోజున సంబంధిత గ్రామంలో ఓ పిక్నిక్‌కు వెళ్లినట్టు భావించాలని సూచించారు. అక్కడ ఆటపాటలతో ప్రజల్లో మమేకమవ్వాలని సూచించారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులు సంతోషాలు, ఆనందాలకు దూరమవుతున్న వాస్తవాలను గుర్తు చేశారు. ముస్తాబు కార్యక్రమం ద్వారా వ్యక్తిగత, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి ఈ కార్యక్రమం ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అన్నారు. చిన్న చిన్న ఆలోచనలు కొన్నిసార్లు గొప్ప ఫలితాలు ఇస్తాయన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు.


