నేరాలు,దారుణాలు పట్టించుకోరా?
● పోలీసులకు సవాల్‌గా నిలుస్తున్న
దోపిడీలు, చోరీలు, హత్యలు
కొత్తవలస: మండలంలో వరుస దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, యథేచ్ఛగా గంజాయి రవాణా జరుగుతున్నా కనీసం పట్టించుకునే పోలీసులే కరువయ్యారు. ఈ అంశాలపై కేసులు నమోదు చేయడమే తప్ప అరెస్టులు, రికవరీలు, దొంగలను పట్టుకునే పరిస్థితి ఏమీ లేకపోవడం గమనార్హం.
కొత్తవలస మండలంలోని జరిగిన ఘటనల
వివరాలు
ఆగస్టు 26, 2024లో ఒక లారీలో 450 కేజీల గంజాయిని విశాఖపట్నం తరలిస్తుండగా అరకు–విశాఖ రోడ్డులో అప్పన్నపాలెం గ్రామం సమీపంలో పోలీస్‌లకు అజ్ఞాత వ్యక్తి సమాచారం ఇవ్వండంతో లారీని పట్టుకున్నారు. కాగా పోలీసులను చూసి నిందితులు పరరయ్యారు. లారీని సీజ్ చేసి 450 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నేటికీ నిందితులను పట్టుకోలేదు. కేసును మూసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.
● మండలంలోని గురుదేవా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్‌బాబు ఇంటో ఈ ఏడాది మే నెల 28వ తేదీన దొంగలు పడి సుమారు మూడు కేజీల బంగారం, రూ 5 లక్షలకు పైగా నగదు దోచుకు పోయారు.ఈ కేసును పోలీసులు ప్రతిస్టాత్మకంగా తీసుకుని అప్పటి జిల్లా ఎస్పీ స్వయంగా ఇన్వెస్టిగేషన్ చేశారు. అయినా నేటికీ అనుమానితులను పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. ఒక్క పైసా నగదు, గ్రాము బంగారం రికవరీ చేయలేదు. ఈ దొంగతనం జిల్లా చరిత్రలోనే అతి పెద్దది కావడం విశేషం.
● అలాగే ఈ ఏడాది నవంబర్ 14న చింతలపాలెం గ్రామం సమీపంలో గల మీసాల రవిప్రకాష్ ఇంటిలో రాత్రి 12 గంటల సమయంలో కుటుంబ సభ్యులు అందరూ నిద్రిస్తుండగా బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులను కొట్టి బంధించి రూ.24 వేల నగదు, కొంత బంగారాన్ని దోచుకుపోయారు. నేటికీ ఈ కేసులో అనుమానితులను పోలీసులు పట్టుకోలేకపోయారు.
● గత నెల 15న వియ్యంపేట గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ దూది రాము (మహిళ)ను ఇంటిలోనే దుండగులు హత్య చేశారు. ఈ హత్య కేసులో అనుమానితులను నేటికీ పట్టుకోలేకపోయారు.
● ఇలా చెప్పుకుంటూ పోతే మంగళపాలెం గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయంలోను, ఆర్‌టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల ఆటోమైబెల్ షాపులోను దొంగలు పడి దోచుకుపోయినా నేటికీ పోలీసులు గుర్తించలేదు.
● స్వయాన రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్నా పట్టించుకోకపోవడం ఈ ప్రభుత్వం చేతకాని తనానికి నిదర్శనంగాా నిలుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నేరాలు,దారుణాలు పట్టించుకోరా?


