ఆ తల్లిదండ్రుల దాతృత్వానికి సత్కారం
● రోడ్డు ప్రమాదంలో మరణించిన
కుమారుడి అవయవ దానం
● తల్లిదండ్రుల గొప్పతనాన్ని గుర్తించి
సత్కరించిన మానవీయత సంస్థ
చీపురుపల్లిరూరల్(గరివిడి): కన్నకొడుకు మరణించాడని తెలిసినా, ఇక ముందు తమ కుమారుడు తమముందు కనిపించడని తెలిసినా, తమ కొడుకు మరణం మరో పది మందికి జన్మనివ్వాలనే ఆశయంతో దుఃఖంలో కూడా కొడుకు అవయవాలను దానం చేసి ఆ తల్లిదండ్రులు తమ దాతృత్వం చాటుకున్నారు. గరివిడి మండలంలోని కాపుశంభాం గ్రామానికి చెందిన టొంపల సుమంత్ రాజాంలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఏజెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.ఈనెల 13న విధులు ముగించుకుని రాజాం నుంచి చీపురుపల్లి వైపు ఆటోలో వస్తుండగా ఓ వ్యాన్ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన సుమంత్‌ను శ్రీకాకుళం జెమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా బ్రెయిన్‌డెడ్‌గా వైద్యాధికారులు నిర్ధారించారు. ఈ మేరకు సుమంత్ తల్లిదండ్రులు రమణ, ఆరుద్రలు కొడుకు మరణించిన బాధలో ఉండి కూడా కొడుకు అవయవాలను దానం చేశారు. ఆ తల్లిదండ్రుల దాతృత్వాన్ని గుర్తించిన చీపురుపల్లి పట్టణానికి చెందిన మానవీయత స్వచ్చంద సంస్థ వ్యవస్ధాపకుడు, రెడ్ క్రాస్ చైర్మన్ బీవీ గోవిందరాజులు గ్రామంలోనికి బుధవారం వెళ్లి సుమంత్ తల్లిదండ్రులను సత్కరించారు.
12 మందికి పునర్జీవం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో కొడుకు అకాల మరణంతో చెప్పలేని దుఖంలో ఉన్నప్పటికీ కొడుకు అవయవాలైన కిడ్నీలు, కాలేయం, హృదయం, నేత్రాలు దానం చేసి మరో 12 మందికి పునర్జీవం కల్పించారని ప్రశంసించారు. శ్రీకాకుళం జిల్లాలోని జెమ్స్ హాస్పిటల్‌లో జరిగిన ఈ అవయవాల దానం గ్రీన్‌ఫీల్డ్ ద్వారా పంపించి అవసరమైన వారికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జనరల్ సెక్రటరీ రామ్మూర్తినాయుడు, స్థానిక ఎంపీటీసీ టి.సంజీవ్ ఉన్నారు.


