టీచర్ల కామన్ సర్వీస్ రూల్స్‌కు తొలగిన అడ్డంకులు
● ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
గాదె శ్రీనివాసులునాయుడు
విజయనగరం అర్బన్: కొన్నేళ్లుగా కోర్టుల్లో వివాదాలతో నడుస్తున్న టీచర్ల కామన్ సర్వీసు రూల్స్ అంశానికి అడ్డంకులు తొలగాయని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు అన్నారు. ఈ మేరకు స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన 26 జిల్లాలను రాష్ట్రపతి అనుమతించి గెజిట్ ఇటీవల విడుదలైందని ఈ నేపథ్యంలో గతంలో ఉమ్మడి రాష్ట్రంలోని జోన్, డివిజన్, జిల్లా ప్రామాణికాలు రద్దవుతాయన్నారు. నూతనంగా ఏర్పడిన 26 జిల్లాలు, జోన్‌లు ప్రామాణికంగా తీసుకుని జిల్లాపరిషత్, మున్సిపాలిటీ, ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలలన్నింటి నిర్వహణ విద్యాశాఖలోకి తీసుకురావడానికి రాష్ట్రప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. గెజిట్‌ను అమలు చేయడానికి ముందుగా ఉన్నతాధికారులతో కమిటీ వేసి రాష్ట్రప్రభుత్వం అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. కామన్ సీనియారిటీ ఆధారంగా లోకల్ కేడర్, నిబంధనలు, పదోన్నతుల ప్రక్రియకు మార్గదర్శకాలను కమిటీ కనీసం 27 రోజుల మినిమమ్ కాలవ్యవధిలో రూపకల్పన చేయాల్సి ఉంటుందని వివరించారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ సెలవుల వయోపరితిని సర్వీసులో ఉన్నంత వరకు పెంచడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపిందని చెప్పారు. 2004 సెప్టెంబర్ తరువాత ఉద్యోగాల్లో ప్రవేశించిన వారికి వర్తింప చేసిన సీపీఎస్ పెన్షన్ స్కీం అప్పడికే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు రాసి ఉద్యోగాలకు పెంపికై న వారికి సీపీఎస్ కాకుండా పాత పెన్షన్ స్కీం అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.రవీంద్రనాయుడు, డి.శ్రీనివాస్, పీఆర్‌టీయూ ఉత్తరాంధ్ర మీడియా ఇన్‌చార్జ్ బంకపల్లి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


