జిల్లా ఆస్పత్రిలో ‘బర్త్ వెయిటింగ్ హోమ్’
● పరిశీలించిన జిల్లా జేసీ యశ్వంత్ కూమర్ రెడ్డి
పార్వతీపురం రూరల్: మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే గర్భిణులకు మెరుగైన ప్రసవ సేవలందించేందుకు జిల్లా ఆస్పత్రిలో ‘బర్త్ వెయిటింగ్ హోమ్’ ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ కేంద్రాస్పత్రిలో రూ. 11.50 లక్షల వ్యయంతో సమకూర్చిన ఆధునిక వైద్య పరికరాలను జిల్లా జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో, సి.యశ్వంత్ కుమార్ రెడ్డి బుధవారం రాత్రి నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఆస్పత్రికి వచ్చే రోగులకు, ముఖ్యంగా గర్భిణులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సిబ్బందికి స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారిణి డాక్టర్ పద్మావతి, ఆర్‌ఎంవో డాక్టర్ శ్యామల పాల్గొన్నారు.
రెండు గడ్డివాములు దగ్ధం
బొండపల్లి: మండలంలోని గొల్లుపాలెం గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి గజపతినగరం అగ్నిమాపక కేంద్రం అధికారి ఎంఎస్‌వీ.రవిప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో గొర్లె బంగారునాయుడికి చెందిన రెండు గడ్డివాములపై గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ కాల్చిపడేయడంతో మంటలు వ్యాపించి అగ్నికి ఆహుతయ్యాయి. సూమారు రూ.15 వేలు ఆస్తినష్టం సంభవించగా, పక్కన ఉన్న గడ్డివాములకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు.
రెండు తులాల బంగారం చోరీ
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దొంగలు ఒంటరి మహిళలను టార్గెట్ చేసి బరి తెగిస్తున్నారు. బుధవారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో చినకుదమ గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో పొలం నుంచి ఇంటికి వస్తున్న నల్ల నారాయణమ్మ ముఖానికి మత్తు మందు కొట్టి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారం తాడును ఎత్తికెళ్లినట్టు బాధితురాలు పోలీసులకు తెలిపింది. తాను పొలం నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఎదురుగా మోటార్ బైక్‌పై వచ్చిన వ్యక్తి కనీసం ముఖానికి మాస్క్, హెల్మెట్ కానీ లేకుండా వచ్చి మత్తు మందు చల్లడంతో ఆ క్షణంలో ఏం జరిగిందో తనకు తెలియలేదని తెలిపింది. పరజపాడు గ్రామంలోని శివాలయంలో హుండీ కానుకలను మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో ఓ దొంగ చాకచక్యంగా దోచుకున్న ఘటనపై చినమేరంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు ఎస్సై అనీష్ తెలిపారు.
వైఎస్సార్‌సీపీలో నూతన నియామకాలు
విజయనగరం: రాష్ట్రంలో బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీలో నూతన నియామకాలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన నియామకాలకు సంబంధించిన జాబితాను పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గజపతినగరానికి చెందిన ఇజ్జరోతు రామునాయుడు, కార్యదర్శిగా బొబ్బిలికి చెందిన బొమ్మి అప్పలనాయుడు నియామకమయ్యారు. అదేవిధంగా జిల్లా ఫెడరేషన్ అధ్యక్షుడిగా రాజాంకు చెందిన మరిశర్ల గంగారావుకు బాధ్యతలు అప్పగించగా.. ఎస్‌కోట నియోజకవర్గ అధ్యక్షుడిగా గోపాల కృష్ణారావు, విజయనగరం నియోజకవర్గం అధ్యక్షుడిగా ఎం.పరమేశ్వరరావు, చీపురుపల్లి నియోజకవర్గం అధ్యక్షుడిగా సింగవరపు రామకృష్ణ, నెల్లిమర్ల నియోజకవర్గం అధ్యక్షుడిగా బోని చంద్రరావు నియామకమైనట్లు జాబితాలో పేర్కొన్నారు.
జిల్లా ఆస్పత్రిలో ‘బర్త్ వెయిటింగ్ హోమ్’
జిల్లా ఆస్పత్రిలో ‘బర్త్ వెయిటింగ్ హోమ్’


