హెచ్చరిక బోర్డు ఉన్నా..
ఈ చిత్రాలు చూశారా.. ఓ వైపు హెచ్చరిక బోర్డు ఉన్నా.. అదే స్థానంలో కొత్తగా నిర్మాణాలకు మట్టివేశారు. ఇది కురుపాం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఆంధ్రా–ఒడిశా ప్రధాన రోడ్డు పక్కన సర్వే నంబర్ 27–2లో ఉన్న 60 సెంట్లు భూమి. ఇది డీ పట్టా భూమి.
ఓ గిరిజన రైతుకు దశాబ్దాల కిందట సాగుపట్టా ఇచ్చారు. ముందుచూపుతో కొన్నేళ్ల కిందట ఓ నాయకుడు ఈ భూమిని కేవలం రూ.6వేలకు కొనుగోలుచేశాడు. ఇక్కడి ధర అమాంతం పెరగడంతో ఏడాది కిందట రూ.45 లక్షలకు వేరేవారికి విక్రయించాడు. దీంతో వారు వ్యాపార సముదాయాల నిర్మాణాలకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు డీ పట్టా భూమిలో నిర్మాణాలు చేపట్టరాదంటూ
అడ్డుకున్నారు. నిర్మాణాలు కూల్చివేసి హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటుచేశారు. ఇప్పుడు మళ్లీ అదే స్థలంలో నిర్మాణాలకు పూనుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనివెనుక అధికార పార్టీకి చెందిన నాయకుడు కీలకంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. రెవెన్యూ అధికారులతో
మంతనాలు జరుపుతూ నాడు అక్రమమని తేల్చిన భూమిని నేడు సక్రమంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సాగు హక్కు పట్టా కలిగిన
గిరిజనుడి పేరుతోనే నిర్మాణాలకు పూనుకున్నట్టు సమాచారం. సాగు కోసం అందజేసిన భూమిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదంటూ
హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసిన రెవెన్యూ అధికారులు ఇప్పుడు ఎలా అంగీకారం తెలిపారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణాలు అడ్డుకుంటారా? అనుమతులు ఇస్తారా అన్న చర్చ కురుపాం జోరుగా సాగుతోంది. – కురుపాం
హెచ్చరిక బోర్డు ఉన్నా..


