ఎయిడ్స్‌పై ‘అవగాహనే’ ఆస్త్రం
● కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి
పార్వతీపురం రూరల్: అవగాహన అనే అస్త్రంతోనే ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేయగలమని, అప్రమత్తతే ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఉద్ఘాటించారు. ప్రపంచ ఎయిడ్స్ నియంత్రణ దినం సందర్భంగా ఆదివారం ప్రభుత్వ భవనాల సముదాయం నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్‌ఐవీ బాధితుల పట్ల సమాజంలో ఉన్న వివక్షను రూపుమాపడమే వ్యాధి నియంత్రణకు తొలిమెట్టు అని పిలుపునిచ్చారు. వ్యాధిగ్రస్తులను చిన్నచూపు చూడకుండా వారిని గుండెలకు హత్తుకునే మానవత్వం పరిమళించాలని హితవు పలికారు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటూ ఏఆర్టీ మందులు, పెన్షన్లు అందిస్తోందని, ఎవరూ అధైర్యపడవ్దని భరోసా ఇచ్చారు. క్షణిక ఆనందం కోసం జీవితాలను పణంగా పెట్టవద్దని, సురక్షిత జీవన విధానమే యువతకు రక్షాకవచమని కలెక్టర్ హితవు పలికారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డా.భాస్కరరావు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డా.వినోద్ కుమార్, ఇతర అధికారులు, పెద్దఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.


