ఘంటసాల జయంతి వేడుకలకు సర్వం సిద్ధం
● ఆహ్వానపత్రికలను ఆవిష్కరించిన
కళాపీఠం వ్యవస్థాపకుడు భీష్మారావు
విజయనగరం టౌన్: అమరగాయకుడు ఘంటసాల జయంతి ఉత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు ఘంటసాల స్మారక కళాపీఠం వ్యవస్థాపకుడు ఎమ్.భీష్మారావు తెలిపారు. స్థానిక కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. డిసెంబర్ 4, 5 తేదీల్లో రెండురోజుల పాటు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. డిసెంబర్ 4న గుమ్చీ జంక్షన్ వద్దనున్న ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం, పుష్పార్చన, అనంతరం సంగీత కళాశాలలో ఉన్న ఘంటసాల విగ్రహానికి పూలమాలాలంకరణ ఉంటుందన్నారు. డిసెంబర్ 5న ఆనందగజపతి కళాక్షేత్రంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఘంటసాల నిర్విరామ సినీ సంగీత స్వరార్చన ఉంటుందన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించే సభా కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత పెర్కషన్ మాస్ట్రో పద్మశ్రీ డాక్టర్ శివమణికి ఘంటసాల పురస్కారాన్ని ప్రదానం చేస్తామని తెలిపారు. జిల్లాలో తొలిసారిగా అడుగుపెడుతున్న శివమణికి పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఆయన సుమారు గంట సమయం సంగీతంతో విజయనగరవాసులను అలరిస్తారన్నారు. జయంతి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.


