పాడి పశువుల్లో సరోగసీ
బొబ్బిలి: పాడిపశువుల్లో సరోగసీ విధానంలో దూడల సంతానోత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె.మురళీకృష్ణ తెలిపారు. స్థానిక డీడీ కార్యాలయంలో విలేకర్లతో బుధవారం మాట్లాడారు. పిండ మార్పిడితో పశువులు చూడికట్టిస్తున్నామని చెప్పారు. రామభద్రపురం, ఆరికతోటల్లోని పశువైద్య కేంద్రాల డాక్టర్లు సరోగసీ విధానంపై శిక్షణ పొందారన్నారు. గిర్, జెర్సీ, ఒంగోలు వంటి జాతులను ఈ ప్రక్రియ ద్వారా అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ఎకరాకు 150 నుంచి 200 టన్నుల దిగుబడి వచ్చే పశుగ్రాస విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 50 సెంట్ల విస్తీర్ణంలో పశుగ్రాసం పెంచేందుకు రూ.32,998ల వ్యయాన్ని ఉపాధిహామీ నిధుల నుంచి పాడి రైతులకు అందజేస్తామని చెప్పారు. దాణాను 50 శాతం రాయితీపై అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్తగా 1260 గోకులాలను మంజూరు చేస్తామన్నారు. ఆయన వెంట ఏడీ డాక్టర్ ఎల్.విష్ణు ఉన్నారు.
ఆర్టీసీ జోనల్ వర్క్‌షాప్‌ను సందర్శించిన జోనల్ చైర్మన్
విజయనగరం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ విజయనగరం జోనల్ వర్క్‌షాప్‌ను బుధవారం ఆ సంస్థ జోనల్ చైర్మన్ సయ్యారీ దొన్నుదొర సందర్శించారు. ఇంజిన్, బాడీ, యూనిట్ విభాగాలను పరిశీలించి సిబ్బంది పని తీరును పరిశీలించారు. అక్కడ ఫ్యూరిఫైడ్ వాటర్ సదుపాయాన్ని ప్రారంభించారు. అనంతరం సిబ్బందినుద్దేశించి మాట్లాడుతూ ఆర్టీసీ విజయనగరం జోన్ అన్ని విభాగాల్లో రాష్ట్రంలోనే ముందంజలో ఉండేలా ఉద్యోగులు కృషి చేయాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ముందుంటామన్నారు. జీతాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి, విశాఖ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ సుధాబిందు, వర్క్స్ మేనేజర్, స్టోర్స్ అధికారులు, సూపర్వైజర్లు, వర్క్‌షాప్ సిబ్బంది పాల్గొన్నారు.
పాడి పశువుల్లో సరోగసీ


