నిరుద్యోగులూ జాగ్రత్త..!
వీరఘట్టం/పాలకొండ/ పాలకొండ రూరల్: నిరు ద్యోగులు, యువతే వారి టార్గెట్. శిక్షణ, ఉద్యోగాల కల్పన పేరుతో వల విసురుతున్నారు. లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. చెక్కులు ఇస్తూ మోసానికి నమ్మకం కలిగిస్తున్నారు. పాలకొండ, వీరఘట్టంలలో వెలసిన కొన్ని పుట్టగొడుగుల కేంద్రాలు అక్రమ డిపాజిట్ల వసూళ్లకు అడ్డాగా మారాయి. దాని యజమానులు.. యువతకు శిక్షణ ముసుగులో ఒక్కొక్కరి నుంచి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.కోటి వరకు డిపాజిట్ల రూపంలో వసూలు చేసినట్టు సమాచారం. వాస్తవంగా ఆర్‌బీఐ గుర్తింపు పొందిన బ్యాంకులు మినహా ప్రైవేటు వ్యక్తులు ఎలాంటి వసూళ్లకు పాల్పడరాదు. అయితే, ఇక్కడ గొలుసుకట్టు వ్యాపారాల పేరుతో నిరుద్యోగుల నుంచి వసూలు చేస్తున్నారు. పుట్టగొడుగుల కేంద్రాలు నష్టాల్లో ఉన్నా... శిక్షణ కోసం చేరిన వారికి రూ.12వేల చొప్పున నెలకు వేతనం ఇస్తామంటూ ఆశ చూపుతున్నారు. శిక్షణకు చేరాక మరింత మందిని చేర్పించాలని సూచిస్తున్నారు. ఇలా.. అందరి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. దానికి ష్యూరిటీగా పదినెలల తర్వాత చెల్లుబాటయ్యేలా చెక్కులు ఇస్తున్నారు. అవి బౌన్స్ అయితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేదు. శిక్షణకు చేరిన వారి నుంచి వసూలు చేసిన డబ్బులతో శిక్షణ కేంద్రాలు పెంచుతూ రూ.కోట్లు కొల్లగొట్టేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు సమాచారం.
మార్కెట్ కూడా అంతంత మాత్రమే....
పాలకొండ, వీరఘట్టం పరిసర ప్రాంతాల్లో పుట్టగొడుగుల మార్కెట్ అంతంత మాత్రంగానే ఉంది. రోజుకు వంద కిలోల దిగుబడి వస్తే కిలో రూ.200 చొప్పున రోజుకు రూ.20 వేలు ఆదాయం వస్తుంది. ఈ లెక్కన నెలకు రూ.6 లక్షలు ఆదాయం వస్తుంది. అయితే ఇక్కడి కేంద్రాల్లో సుమారు 75 మంది పని చేస్తున్నారు. వీరికి నెలకు రూ.12 వేలు చొప్పున జీతం ఇవ్వాలంటే ప్రతీ నెలా రూ.9 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే వచ్చే ఆదాయం కంటే ఖర్చే రూ.3 లక్షలు అధనం. ఏడాది పొడువునా వ్యాపారం జరిగితే సంవత్సరానికి రూ.36 లక్షలు నష్టమే వస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆ పుట్టగొడుగుల కేంద్రాల్లో రోజుకు 20 కిలోలు పుట్టగొడుగు కూడా దిగుబడి రావడం లేదు. ఈ లెక్కన ఈ వ్యాపారం వల్ల నష్టం తప్ప లాభం లేదు. డబ్బులు బలవంతంగా వసూలు చేయడంలేదని, ఇచ్చిన వారి నుంచి తీసుకుంటున్నామన్నది నిర్వాహకుల మాట.
డిపాజిట్ల సేకరణ ఒక ఆర్ధిక నేరం..
జాతీయ, రిజర్వ్ బ్యాంకు అనుమతులు ఉన్న సంస్థలే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలే తప్ప అనధికార వ్యక్తులు లేదా ప్రైవేటు సంస్థలు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడం ఆర్థిక నేరం. ఎవరైనా ఇటువంటి డిపాజిట్లు సేకరిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పనిలో, శిక్షణకోసం చేరిన వారి నుంచి డిపాజిట్లు సేకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్న పట్టగొడుగుల కేంద్రాల నిర్వహణపై విచారణ చేపడతాం. – ఎం.రాంబాబు, డీఎస్పీ, రాంబాబు
పాలకొండ పుట్టగొడుగుల
కేంద్రంలో అనధికార వసూళ్లు
పనిలో చేరిన వారిలో ఒక్కొక్కరి వద్ద రూ.50 వేలు నుంచి రూ.1 లక్ష వరకు వసూలు!
అదే తరహాలో వీరఘట్టంలో మరో పుట్టగొడుగుల కేంద్రం ఏర్పాటు
గొలుసుకట్టు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు
నిరుద్యోగులను ఉచ్చులోకి లాగుతున్న దళారులు
ఇప్పటికే రూ.కోటి వరకు వసూలు చేసినట్టు సమాచారం


