ఎవరి అండ?
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం పట్టణంలోని వరహాలు గెడ్డ ఆక్రమణల వెనుక ఎవరున్నారు?.. రిజిస్ట్రేషన్ అక్రమమని తెలిసినా.. దానిని రద్దు చేసే సాహసం ఎందుకు చేయడం లేదు?.. హెచ్చరిక బోర్డులు పెట్టినా.. దర్జాగా కంచెలు ఎలా వెలుస్తున్నాయి? తమ ఆక్రమణలను కప్పి పుచ్చుకునేందుకు ఎవరినైనా.. ‘కొనేందుకు’ ఆక్రమణదారులు ఏ ధైర్యంతో సిద్ధపడుతున్నారు?.. పట్టణంలోని ప్రతి ఒక్కరిలోనూ మెదలుతున్న ప్రశ్నలు ఇవి. ఇంత జరుగుతున్నా.. అధికారులు ఇంకా వేడుక చూస్తూనే ఉన్నారు. జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న సుమారు రూ.19 కోట్ల విలువైన వరహాల గెడ్డ ప్రభుత్వ భూమి ఆక్రమణకు మున్సిపల్, రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ అధికారులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాల్సిన వీరే.. అక్రమార్కులకు కొమ్ముకాయడం గమనార్హం.
మున్సిపల్, రెవెన్యూ
అధికారుల డబుల్‌గేమ్
గెడ్డ స్థలాన్ని కలిపేసుకుని విక్రయించిన తర్వాత విషయం బయటకు వచ్చింది. వామపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వరహాల గెడ్డ భూమి చుట్టూ ట్రెంచ్ ఏర్పాటు చేశారు. ఆ స్థలంలో అది ప్రభుత్వ భూమి అని, ఆక్రమణదారులు శిక్షార్హులని బోర్డు పెట్టి చేతులు దులుపేసుకున్నారు. ఓ వైపు ఈ తంతు జరుగుతుండగానే.. మరోవైపు ఆక్రమణదారులు విషయాన్ని చల్లార్చేందుకు కొంతమందితో ‘డీల్’ కుదుర్చుకోవడం గమనార్హం. ఏ ధైర్యంతో వీరు ఆ ప్రయత్నాలు చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అక్రమంగా చేసిన రిజిస్ట్రేషన్‌ను సైతం అధికారులు రద్దు చేయడం లేదు. దీంతో ప్రభుత్వ భూమికి ఇప్పటికీ రక్షణ లేదన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. వరహాల గెడ్డ సర్వే నంబర్ 410కి సంబంధించిన గెడ్డ పోరంబోకు ప్రాంతాన్ని పూర్తిగా సర్వే జరపాలని, గెడ్డ ఎంత విస్తీర్ణంలో ఉండేదో హద్దులు నిర్ణయించాలని, ఆక్రమిత స్థలంలో నిర్మించిన శాశ్వత కట్టడాలను తొలగించాలని ప్రజాసంఘాలు చేస్తున్న డిమాండ్‌కు ఏ ఒక్కరి నుంచీ స్పందన ఉండడం లేదు.
ఎవరైనా ఓ కన్నేయాల్సిందే...
వరహాలగెడ్డ ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 410లో ఉంది. గతం నుంచీ ఇక్కడ ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయి. మొక్కలు వంటివి సైతం దర్జాగా వేసుకున్నారు. పట్టణానికి చెందిన వ్యాపారికి ఇక్కడ కొంత స్థలం ఉంది. అది అడ్డదిడ్డంగా ఉంది. దీంతో పక్కనే ఉన్న వరహాల గెడ్డ ప్రభుత్వ భూమిపై ఆ వ్యాపారి కన్నేశారు. ఆ స్థలాన్ని కలపకపోతే.. తన స్థలానికి విలువ ఉండదు. మార్గం కూడా మూసుకుపోతుంది. దీంతో ఆక్రమణకు పథకం వేశారు. ఇందుకోసం అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుడి సహకారం తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తం పక్కా ప్రణాళికతో విశాఖపట్నానికి చెందిన లక్కీ షాపింగ్ మాల్ యజమానికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారు. తన జిరాయితీ సర్వే నంబర్ 411–9తో ప్రభుత్వ భూమిని కలిపి రిజిస్ట్రేషన్ చేయించారు. మొత్తం 1200 గజాల స్థలాన్ని లక్కీ షాపింగ్ మాల్ యజమానికి రిజిస్ట్రేషన్ చేశారు. ఆక్రమణల క్రమంలో రికార్డుల ట్యాంపరింగ్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. 411 జిరాయితీ సబ్ డివిజన్ 8లోనే దాదాపు 600 గజాల స్థలం ఉంది. ఇది రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుపడదు. ఇదే సర్వే నంబర్ సబ్ డివిజన్‌తో 9తో రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది.


