భూ సర్వే సక్రమంగా చేయాలి
● డీడీ త్రివిక్రమరావు
పాలకొండ రూరల్: భూ సర్వే సమగ్రంగా చేపట్టాలని ఏపీ ల్యాండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) టి.త్రివిక్రమరావు అన్నారు. పాలకొండ మండలం గొట్ట మంగళాపురంలో జరుగుతున్న భూ సర్వే ప్రక్రియను ఆయన బుధవారం పరిశీలించారు. భూ యజమానుల, సంబంధిత రైతుల సమక్షంలో అధికారులు సర్వే చేపట్టాలని సూచించారు. సర్వే వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతన్న ఈ ప్రక్రియ ప్రస్తుతం 48 శాతం జరిగిందని, 2027 డిసెంబర్ నాటికి పూర్తిచేసేలా నిర్దేశించామన్నారు. ఆయన వెంట జిల్లా సర్వేయర్ పి.లక్ష్మణరావు, మండల సర్వేయర్ శ్రీనివాసరావు, సిబ్బంది ఉన్నారు.
మహిళలకు రూ.1100 కోట్ల రుణం లక్ష్యం
● డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస పాణి
నెల్లిమర్ల: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు రూ.1100 కోట్లు రుణాలు అందజేయాలన్నది లక్ష్యమని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస పాణి తెలిపారు. నెల్లిమర్ల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం వెలుగు వార్షిక కార్యాచరణ ప్రణాళికపై జిల్లా స్థాయి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా లో మొదటి విడత 10 మండల సమాఖ్యలను, రెండు, 3, 4 విడతల కింద మూడు మండల సమాఖ్యలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఏపీఎం సురేష్ ఆధ్వర్యంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో వెలుగు–డీఆర్‌డీఏ అదనపు పథక సంచాలకులు కె.సావిత్రి , జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎ.చిరంజీవి, ఏపీఎం విశ్వేశ్వరరావు, సురేష్, పద్మ, 9 మండలాల ఏపీఎంఎంస్ సీసీలు, అకౌంటెంట్లు పాల్గొన్నారు.
సంకిలి చక్కెర కర్మాగారం పరిశీలన
రేగిడి: మండలంలోని సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారాన్ని చీపురుపల్లి ఆర్డీఓ సత్యవేణి బుధవారం పరిశీలించారు. కర్మాగారంలో సల్ఫర్ స్టోరేజ్ లైసెన్స్ రెన్యువల్‌కు యాజమాన్యం దరఖాస్తు చేసుకోవడంతో పరిశీలించినట్టు ఆర్డీఓ తెలిపారు. ఆమె వెంట తహసీల్దార్ ఐ.కృష్ణలత, సిబ్బంది ఉన్నారు.


