టీడీపీలో అసంతృప్తి సెగలు
వీరఘట్టం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ అంధకారంలో ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకులు పరిశీలకుల ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పాలకొండ కూటమిలో నెలకొన్న అంతర్గత విబేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. స్థానిక శ్రీకోదండరామా కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన పాలకొండ నియోజకవర్గ సంస్థాగత ఎన్నికల సమీక్ష సమావేశంలో పార్టీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ కనుమరుగవుతుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఖండాపు వెంకటరమణ తేల్చి చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అహంకార ధోరణితో పార్టీని నమ్ముకున్న టీడీపీ నాయకులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. సొంత పార్టీ కార్యకర్తలపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే తమపై కూడా కేసులు పెడతామని బెదిరిస్తున్నారని పార్టీ పరిశీలకులు ముందు తెలిపారు. సమావేశానికి స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు రాకుండా అడ్డుకున్నారని చెప్పారు. అనంతరం టీడీపీ అరుకు పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు కిడారి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ పాలకొండ నియోజకవర్గం కూటమి నాయకుల్లో అంతర్గత విబేధాలు ఉన్నట్టు స్పష్టమౌతోందన్నారు. ఇక్కడ పార్టీ సీనియర్ నాయకులు చెప్పిన ప్రతీ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. పార్టీ పెద్దల సూచనలతో నియోజకవర్గంలో పార్టీ నూతన క్యాడర్‌ను నియమిద్దామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు శివ్వాల సూర్యనారాయణ, నియోజకవర్గం ఇన్‌చార్జ్ పడాల భూదేవి, గేదెల గజేంద్ర, కర్నేన అప్పలనాయుడు, బుజ్జి, పప్పల మహేష్, పిన్నింటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
అంధకారంలో పాలకొండ టీడీపీ
ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ కనుమరుగవుతుంది..
పరిశీలకుల ముందు టీడీపీ సీనియర్ నాయకుల ఆవేదన
మరోసారి కూటమిలో బహిర్గతమైన అంతర్గత విబేధాలు


