ప్రణాళిక విభాగంతోనే అభివృద్ధి సాధ్యం
విజయనగరం: నగరాలు, పట్టణాలు అభివృద్ధిలో పట్టణ ప్రణాళిక విభాగం కీలకమని, క్షేత్ర స్థాయి విధుల నిర్వహణలో అనేక ఒత్తిళ్లు, సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అన్నారు. నగరంలోని ఓ హోటల్లో అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడు తూ టౌన్ ప్లానింగ్ విభాగంలో క్షేత్ర స్థాయి సిబ్బంది కొరత ఉందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీ కావటం లేదని సచివాలయ ప్లానింగ్ సెక్రటరీలకు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌లుగా వినియోగించుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం స్పందించి పూర్తిగా వారికి బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతలు కల్పించాలన్నా రు. దీనికోసం సచివాలయ ప్లానింగ్ సెక్రటరీల సర్వీస్ రూల్స్‌ను అమెండమెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ప్లానింగ్ విభాగాన్ని మరింతగా బలోపేతం చేయటం ద్వారా పట్టణాలు, నగరాలు, స్మార్ట్ సిటీలలో అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. నూతనంగా ఏర్పా టు చేస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు వాటికి కనెక్టింగ్ రోడ్లు నిర్మాణానికి ప్రణాళిక విభాగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సభ్యులకు గ్రూప్ ఇన్సూ రెన్స్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన విధి విధానాలను పరిశీలించాలని సూచించారు. అసోసియేషన్ కార్యదర్శి మోహన్‌బాబు మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఓ మారు సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తున్నామని, సభ్యుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. జోనల్ అధ్యక్షులు వసీంబేగ్ మాట్లాడుతూ నగరాల్లో పట్టణ ప్రణాళిక విభాగంపైనే అధికంగా ఒత్తిడి ఉంటుందని, నగర పౌరులకు ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా ముందుగా ఈ విభాగమే గుర్తుకు వస్తుందన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షు డు అబ్దుల్ సత్తార్, ఆర్డీడీపీ నాయుడు, మొదటి జోన్ అధ్యక్షుడు ఐ.వి.రమణమూర్తి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, జి.కృష్ణ, రతన్ రాజు, టీపీఎస్ సునీత, మతిన్ పాల్గొన్నారు.


