పోక్సో కేసులో ముద్దాయికి మూడేళ్ల జైలు
విజయనగరం క్రైమ్: జిల్లాలోని జామి పోలీస్‌స్టేషన్ పరిధిలో 2024 లో నమోదైన పోక్సో కేసులో ముద్దాయికి మూడేళ్ల జైలుశిక్ష పడిందని ఎస్పీ దామోదర్ సోమవారం చెప్పారు. ఈ కేసు
వివరాల్లోకి వెళ్తే.. జామి మండలంలోని మాధవరాయమెట్టలో నివాసం ఉంటున్న వంతల శివ, (23) గతేడాది జూన్ 6న అదే గ్రామంలో ఉంటున్న ఒక బాలిక (12) రాత్రి సుమారు 10 గంటలకు ఇంటిముందు ఆరు బయట మంచంపై నిద్రిస్తున్న సమయంలో ఎత్తుకుని దగ్గరలో ఉన్న ఒక తోటలోకి తీసుకు వెళ్లి, లైంగికదాడికి పాల్పడబోయాడు. దీంతో ఆ బాలిక కేకలు వేయడంతో దగ్గరలో ఉన్న జనం వెంటనే తోటలోకి వచ్చేసరికి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయమై బాలిక ఇచ్చిన ఫిర్యాదుపై అప్పటి జామి ఎస్సై జి.వీరబాబు గత ఏడాది జూన్ 7న పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. అనంతరం, కేసు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించి, న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలు చేశారు. నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు కె.నాగమణి 3సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. రూ.4,000 జరిమానా విధించడంతో పాటు, బాధితురాలికి పరిహారంగా రూ.50,000 మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించారని ఎస్పీ వివరించారు. ఈ కేసులో పోక్సో కోర్టు ఇన్‌చార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.ఖజానారావు వాదనలు వినిపించారన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
