జోగిరమేష్ అరెస్ట్ రాజకీయకక్ష సాధింపే..
● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర
సాలూరు: మాజీ మంత్రి జోగిరమేష్ అరెస్ట్ పూర్తిగా రాజకీయకక్షసాధింపు చర్య అని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన సాలూరులోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ జోగిరమేష్ అరెస్ట్‌ను ఖండించారు. లిక్కర్ మాఫియా అంటూ సిట్ దర్యాప్తు పూర్తిగా రాజకీయకక్ష సాధింపుగానే కనిపిస్తోందని, తప్పెవరు చేశారో సిట్ నేటికీ తేల్చలేకపోతోందన్నారు. లిక్కర్‌స్కాంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారని గుర్తుచేశారు. దారినపోయిన దానయ్య ఇచ్చిన స్టేట్‌మెంట్ ఽ ఆధారంగా కేసులు నమోదుచేస్తే సమాజంలో ప్రతి ఒక్కరినీ అరెస్ట్‌చేసే అవకాశం ఉంటుందన్నారు. కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటలో భక్తులు మరణించిన అంశం నుంచి ప్రజలను పక్కదోవ పట్టించే ఉద్దేశంతో జోగి రమేష్‌ను ఈ ప్రభుత్వం అరెస్ట్‌చేయించిందన్నారు. నకిలీ మద్యంపై ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులుండగా ప్రభుత్వం ఆదరబాదరాగా కక్షసాధింపు చర్యలకు పాల్పడి టీడీపీ నాయకులను కాపాడే ప్రయత్నం చేయడానికేనని విమర్శించారు. లిక్కర్ విషయంపై హైకోర్టు త్వరగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతున్నామన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
