పోటెత్తిన అర్జీదారులు
● పీజీఆర్‌ఎస్‌లో 375 వినతుల నమోదు
విజయనగరం అర్బన్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు అర్జీదారులు పోటెత్తారు. వరుసగా గడిచిన రెండు సోమవారాలు సెలపు కావడంతో ఈ సోమవారం పునఃప్రారంభించిన పీజీఆర్‌ఎస్‌లో వినతులు ఇచ్చేవారి సంఖ్య పెరిగింది. పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన వినతుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ కౌంటర్ల ఎదుట క్యూలో ఉన్న ప్రజలు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బారులు తీరారు. ప్రధానంగా రెవెన్యూ సమస్యలు వెల్లువెత్తాయి. వినతుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన 10 కౌంటర్లలో 5 కౌంటర్లు రెవెన్యూకే కేటాయించినా రద్దీ తగ్గలేదు. మరో వైపు ఆన్‌లైన్ నెట్ సర్వర్ ఇబ్బందులు కూడా ఎదురవడంతో అర్జీదారులు గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి, జేసీ సేతు మాధవన్, డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఎస్‌డీసీలు మురళి, వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీలగాంధీ, బి.శాంతి, కళావతి, జిల్లా అధికారులు వినతులను స్వీకరించారు. ఈ వారం గతంలో ఎప్పడూ నమోదు కాని సంఖ్యలో 375 వినతులు వచ్చాయి.
సకాలంలో ఫిర్యాదులు పరిష్కరించాలి
అధికారులందరూ ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఆధికారులకు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ప్రజల విజ్జప్తులను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ ప్రతి దరఖాస్తుపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. సమయపాలనతో పారదర్శకంగా ప్రతి ఫిర్యాదును నాణ్యవంతంగా పరిష్కరించాలని సూచించారు.
మెంటాడ మండలాన్ని మన్యంలో కలపొద్దు
మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లా నుంచి వేరుచేసి పార్వతీపురం మన్యం జిల్లాలో కలిపేందుకు చేస్తున్న ప్రభుత్వం ఆలోచన విరమించుకోవాలని కోరుతూ ఆ మండల వైఎస్‌ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన సమయంలో ప్రజల అభీష్టంమేరకు అప్పటి సాలూరు ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో ఇచ్చిన వినతిపై స్పందించిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలోనే ఉంచారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మండలాన్ని మన్యం జిల్లాలో కలిపే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోందని ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతున్నామన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో మెంటాడ మండల వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు రాయిపిల్లి రామరావు(రవి), ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు, జెడ్‌పీటీసీ లెంక రత్నాకర్, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మయూరి అప్పలనాయుడు, సన్యాసినాయుడు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, విశ్రాంతి ఉద్యోగులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.
							పోటెత్తిన అర్జీదారులు

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
