వ్యాసరచన, వక్తృత్వపోటీలకు అనూహ్య స్పందన
విజయనగరం టౌన్: మహాకవి గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లాస్థాయిలో పాఠశాల విద్యార్థులకు గురజాడ కేంద్ర గ్రంథాలయం ఆవరణలో సోమవారం నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలకు అనూహ్య స్పందన లభించిందని గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ పేర్కొన్నారు. 500 మందికి పైగా విద్యార్థులు పోటీలలో పాల్గొన్నారు. విజేతలకు నవంబరు 30న గురజాడ వర్ధంతి రోజున నిర్వహించే గురజాడ విశిష్ట పురస్కార ప్రదాన ఉత్సవంలో బహుమతులు అందజేస్తామన్నారు. కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా మానాపురం రాజా చంద్రశేఖర్, డాక్టర్ జక్కు రామకృష్ణ, ఈపు విజయకుమార్, గురజాడ ఇందిర వ్యవహరించారు. మానాప్రగడ సాహితి, ఈశ్వరరావు, డి.రాజేంద్రప్రసాద్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో సంస్థ ప్రతినిధులు డాక్టర్ ఎ.గోపాలరావు, డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
