అసత్యాలు చెప్పేందుకు సిగ్గుపడాలి
జియ్యమ్మవలస రూరల్: అసత్యాలు మాట్లాడేందుకు సిగ్గుపడాలి.. గిరిజన విద్యార్థులు జ్వరాలతో బాధపడుతుంటే సంబంధం లేదా..? వాటికి కారణాలు తెలుసుకుని సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరిది?... గిరిజనుల ఓట్లతో గెలిచి కేవలం మంత్రి పదవిని మాత్రమే అనుభవిస్తారా?.. గిరిజన బిడ్డల జ్వరాలపై వ్యంగ్య వ్యాఖ్యలకు తక్షణమే గిరిజనులు, గిరిజన సంఘాలకు క్షమాపణ చెప్పాలని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి డిమాండ్ చేశారు. చినమేరంగిలోకి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల విజయనగరం జిల్లాలో ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. గిరిజన విద్యార్థులు జ్వరాలతో ఆస్పత్రుల పాలవుతుంటే నివారణ చర్యలు చేపట్టకుండా బాధ్యతలేదంటూ తప్పించుకోవడం తగదన్నారు. గిరిజన, సీ్త్ర శిశుసంక్షేమ శాఖలో మంత్రిగా కొనసాగుతున్నానన్న అధికార అహంకారాన్ని వీడి ఓ గిరిజన మహిళగా ఆలోచించాలని హితవు పలికారు. ఇటీవల కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థులు పచ్చకామెర్ల వ్యాధి బారినపడి ఇద్దరు పిల్లలు మరణిస్తే కనీసం ఆదుకునే చర్యలు చేపట్టకపోవడాన్ని ప్రశ్నించారు. సుమారు 200 మంది బాలికలు పచ్చకామెర్లతో ఆస్పత్రుల పాలయ్యారని, మా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వైజాగ్ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారన్నారు. స్వపక్షంలో ఉన్నా.. విపక్షంలో ఉన్నా పేదలకు కష్టమొస్తే ఆదుకునే మనిషి జగనన్న అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 750 ఆశ్రమ పాఠశాలల్లో 199 మంది ఏఎన్‌ఎంల నియామకం జరిగిందని మంత్రి సంధ్యారాణి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, వాస్తవానికి రాష్ట్రంలో 370 ఆశ్రమ పాఠశాలలున్నాయని, 15 జూలై 2023న 199 ఏఎన్‌ఎం నియామకాలు జరగాయన్నారు. ప్రతి ఆశ్రమ పాఠశాలకు ఒక ఏఎన్‌ఎంను వేస్తానని మంత్రిగా తొలి సంతకం చేసి ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. గిరిజన విద్యార్థులకు అవసరమైన 40 మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 30 లక్షల నిధులు ఖర్చు చేశారని, వాస్తవానికి అవి ఇంకుడు గుంతలే తప్ప సెప్టిక్ ట్యాంక్‌లు నిర్మించలేదని, పైగా 611 మంది విద్యార్థులకు అవి సరిపడవన్నారు. ఓడీఎఫ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి మంజూరైన సంగతి అందరికీ తెలుసన్నారు. అబద్ధాలు చెప్పడంలో ఒకరు జ్ఞాని, ఇంకొకరు విజ్ఞానిగా పేరొందరంటూ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణిలను విమర్శించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు ఎం.శశికళ, పద్మావతి, మండల కన్వీనర్ రమేష్ నాయుడు, వైస్ ఎంపీపీ సంపత్ కుమార్, నారాయణరావు, బలగ వెంకటరమణ, ఈశ్వరరావు, రవణమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.
గిరిజన బిడ్డల ఆరోగ్యాన్ని
పట్టించుకోరా?
జ్వరాలతో బాధపడుతుంటే
సంబంధం లేదా?
గిరిజనుల ఓట్లతో గెలిచి కేవలం మంత్రి పదవిని మాత్రమే
అనుభవిస్తారా?
మంత్రి, ప్రభుత్వ విప్ తీరును
దుయ్యబట్టిన మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి


