గంజాయి కేసులో ఇద్దరు ముద్దాయిలకు మూడేళ్ల జైలు
విజయనగరం క్రైమ్: జిల్లాలోని ఎన్.కోట పోలీసుస్టేషన్‌లో 2018లో నమోదైన గంజాయి కేసులో ఇద్దరు ముద్దాయిలకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ ఏఆర్.దామోదర్ గురువారం తెలిపారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..ఏఎస్‌ఆర్ జిల్లాకు చెందిన నిందితుడు (ఎ1) కిముడు జయరాం (22), అనకాపల్లి జిల్లా సబ్బవరానికి చెందిన నిందితుడు (ఎ2) దత్తి ప్రవీణ్ (22)లు ఎస్.కోట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆకుల డిపో వద్ద 2018 డిసెంబర్ 20న బైక్‌పై అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేసి 3.750 కిలోల గంజాయిని అక్రమంగా రవాణ చేస్తున్నట్లు గుర్తించారు. అప్పటి ఎస్సై ఎస్.అమ్మి నాయుడు కేసు నమోదు చేయగా సీఐ డా.బి.వెంకటరావు దర్యాప్తు చేపట్టి, నిందితులను అరెస్టు చేశారు. తదుపరి ఎస్.కోట సీఐగా బాధ్యతలు చేపట్టిన బి.శ్రీనివాసరావు కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. కోర్టు విచారణలో నిందితులపై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.20,000 జరిమానా విధించారని ఎస్పీ తెలిపారు.
రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
బొండపల్లి: మండలంలోని బోడసింగిపేట గ్రామానికి సమీపంలో రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గజపతినగరం మండలంలోని తుమ్మకాపల్లి గ్రామానికి చెందిన నడిపిల్లి వెంకటేష్(23) స్నేహితుడు లోగిశ గ్రామానికి చెందిన శనపతి సురేష్ ద్విచక్ర వాహనాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చి వేకువ జామున గుర్తు తెలియని రైలు కింద పడడంతో శరీరం ముక్కలుముక్కలై చెల్లాచెదురైంది. మృతుడి వద్ద లభించిన ఆధారాలతో పాటు, ద్విచక్ర వాహనం వద్ద లభించిన ఆధారాలతో మృతుడిని గుర్తించినట్లు రైల్వే హెచ్‌సీ తెలిపారు. మృతుడి తండ్రి పైడిరాజు ఇటీవల మృతి చెందడంతో అప్పటి నుంచి తీవ్ర మనోవేదనలో ఉన్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. గజపతినగరం స్టేషన్‌మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి మృతదేహాన్ని జిల్లా కేంద్ర సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
పాముకాటుతో మహిళ
మృతి
గజపతినగరం: మండలంలోని కొనిశ గ్రామానికి చెందిన సూరెడ్డి అన్నపూర్ణ (47)పాము కాటుతో మృతిచెందింది. గురువారం జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం భర్త బుచ్చిబాబుతో కలిసి గ్రామం సమీపంలో ఉన్న గొడ్డు పొలంలో పత్తి ఏరేందుకు అన్నపూర్ణ వెళ్లింది. పత్తి ఏరుతుండగా ఆమెను పాము కరవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయింది. వెంటనే భర్త బుచ్చిబాబు, మేకలు మేపుతున్న మరో వ్యక్తి సహాయంతో గజపతినగరం ఏరియా ఆస్పత్రికి వైద్యం కోసం తరలించారు. వైద్యులు పరిక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్ట్‌మార్టం కోసం విజయనగరం సర్వజన ఆస్పత్రికి మృతదేహాన్ని పోలీసులు తరలించారు.
108లో ప్రసవం
సీతంపేట: మండంలోని గూడగుడ్డి గ్రామానికి చెందిన గర్భిణి ఎం.ఎనిబిత 108లో గురువారం ప్రసవించింది. పురిటి నొప్పులు ఆమెకు రావడంతో గ్రామస్తులు 108కు ఫోన్ చేశారు. భామిని 108 ఈఎంటీ రాములు, పైలెట్ శ్రీనివాసరావులు గ్రామానికి వెళ్లి వాహనంలో ఎక్కించి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో డెలివరీ కండక్ట్ చేశారు. మూడో కాన్పులో ఆడశిశువుకు ఆమె జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. సులువుగా ప్రసవ చేసిన 108 సిబ్బందిని గ్రామస్తులు, గర్భిణి కుటుంబసభ్యులు అభినందించారు.
గంజాయి కేసులో ఇద్దరు ముద్దాయిలకు మూడేళ్ల జైలు


