తారకరామపై ఎమ్మెల్సీ ప్రశ్నలు
● సమాధానమిచ్చిన మంత్రి
రామానాయుడు
● పునరావాస ప్యాకేజీ రూ.172.87 కోట్లు చెల్లించాలి
నెల్లిమర్ల రూరల్: తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టుపై ఇటీవల శాసన మండలిలో జరిగిన చర్చలో ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సూర్యనారాయణ రాజు(సురేష్ బాబు) ప్రశ్నల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. నిర్వాసితుల సమస్యలను ఎమ్మెల్సీ మండలిలో లేవనెత్తారు. దీంతో తాజాగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు లేఖ ద్వారా ఎమ్మెల్సీకి సమాధానం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన బాధితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇస్తామని చెప్పడం వాస్తవం కాదా? అని ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నకు.. వాస్తవమేనని, ఏటీ అగ్రహరం, పడాలపేట, కోరాడపేట గ్రామాలకు ప్యాకేజీ కింద రూ.172.87 కోట్లు చెల్లించాల్సి ఉందని మంత్రి లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టులో భాగంగా సారిపల్లి నుంచి మండల కేంద్రానికి వెళ్లే రహదారి మునిగిపోవడం వాస్తవమేనా? అని ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాస్తవమేనని..రెండు చోట్ల రోడ్డు మునిగిపోతుందని..దాని కోసం రోడ్డు అలైన్‌మెంట్ మార్చినట్లు మంత్రి పేర్కొన్నారు. దీని కోసం 9.2 ఎకరాల భూసేకరణ చేపడుతున్నామని, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ శాఖలు ఆమోదం తెలిపాయని బదులిచ్చారు. మంత్రి సమాధానాలకు ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు స్పందించారు. నిర్వాసితులకు రావాల్సిన పునరావాస ప్యాకేజీ, అవసరమైన నిధులు ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలని కోరారు. భోగాపురం విమానాశ్రయానికి తారకరామ నీటిని మళ్లిస్తామని చెబుతున్నారని, ప్రాజెక్టు పనులు నత్తనడకన కొనసాగితే లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుందని ప్రశ్నించారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రాజెక్ట్ నిర్మాణం వేగవంతం చేయాలని కోరారు.


