కోతకు గురైన ప్రధాన రహదారి
పార్వతీపురం: పార్వతీపురం–శ్రీకాకుళం ప్రధాన రహదారిలో పార్వతీపురం మండలంలోని అడ్డాపుశీల జంక్షన్ వద్ద రహదారి కోతకు గురై ప్రమాదభరితంగా ఉంది. నెలరోజుల క్రితం కురిసిన భారీవర్షానికి రహదారి పరిధిలో రెండు అడుగుల లోతులో కోతకు గురైంది. ఈ రహదారి పరిధిలో ఆదమరిచి ప్రయాణిస్తే పెనుప్రమాదం సంభవించే ఆస్కారం ఉంది. ఈ రహదారిగుండా నిత్యం వందలాది భారీ వాహనాలు రాకపోకలు చేయడంతో పాటు వేలాదిగా ద్విచక్రవాహనాలు తిరుగుతుంటాయి. కార్తీకమాసంలో అడ్డాపుశీలలో ఉన్న శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు తరలివస్తారు. దీంతో రహదారి మరింత రద్దీగా మారే అవకాశం ఉంటుంది. రహదారి కోతకు గురై నెలలు గడుస్తున్నా అధికారులు స్పందించకపోవడంతో స్థానికులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ప్రధాన రహదారినుంచి అడ్డాపుశీల గ్రామానికి వెళ్లే రహదారి మరింత కోతకు గురికావడంతో స్థానికులు రాకపోకలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈ రహదారి పరిధిలో అడ్డాపుశీల జంక్షన్ నుంచి పార్వతీపురం ఆర్‌టీసీ బస్టాండ్‌వరకు పలుచోట్ల రహదారి మరమ్మతులకు గురికావడంతో నిత్యం రాకపోకలు చేసేందుకు అవస్థలు పడుతున్నారు. ప్రమాదాలు జరిగితే గానీ అధికారులు స్పంధించరని పలువురు అంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రమాదాలు సంభవించకముందే రహదారికి మరమ్మతులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
పట్టించుకోని అధికారులు
కోతకు గురైన ప్రధాన రహదారి


